కేసీఆర్ ఫాంహౌస్ లో ఓట్లు లెక్కిస్తారేమో: విజయశాంతి

Update: 2020-10-28 18:00 GMT
తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ బయటకు వచ్చారు. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్టును పెట్టారు. చివర్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా పేర్కొనడంతో ఆమె పార్టీ మార్పు ఊహాగానాలకు తెరపడింది.

దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని విజయశాంతి ఆరోపించారు. దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందని ఆమె ఆరోపించారు..

అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుందని.. హరీష్ రావు కామెంట్ చూస్తూ ఉంటే... దుబ్బాక లో పోలింగ్ జరిగిన తర్వాత... కేసిఆర్ ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో? అనే అనుమానం కలుగుతోందని విజయశాంతి నిప్పులు చెరిగారు.

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టిఆర్ఎస్ పార్టీ... ముఖ్యంగా హరీష్ రావు గారు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు గారి మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కెసిఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి ఆరోపించారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు., కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు.
Tags:    

Similar News