మోడీ మీద విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు

Update: 2019-04-20 06:51 GMT
అలనాటి తెలుగునటి, కాంగ్రెస్‌ నాయకురాలు, తెలంగాణ ఆడబిడ్డ అయిన విజయశాంతి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. గత శుక్రవారం సాయంత్రం ఆమె కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కలబుర్గి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికార్జునఖర్గేకు మద్దతుగా సేడమ్‌ అసెంబ్లీ స్థానం ముధోల్‌ తాలుకాలో ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఓ క్రిమినల్‌.. అంతటి క్రిమినల్‌ ను తాను ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు.

అబద్ధాలు చెప్పడంలో నరేంద్రమోదీకి సాటి ఎవరూ లేరన్నారు. మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు నమ్మి మోసం చేస్తే ‘మన గోతి మనమే తవ్వుకున్నట్లే’ అన్నారు. పెద్ద నోట్ల రద్దు - జీఎస్‌ టీ అమలు చేసి దేశవ్యాప్తంగా జనాలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పిస్తానని ప్రగల్బాలు పలికారు.. కానీ దేశంలోనే చాలామంది రూ.వందల కోట్లు లూటీ చేసి విదేశాలకు పారిపోయినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ఆయన అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడమే పనిగా ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. మే 23న మోదీ ఓటమి చవి చూస్తారని జోస్యం చెప్పారు.

భారతీయ జనతా పార్టీ తరఫున పొలిటికల్ కెరీర్ ను ఆరంభించిన విజయశాంతి ఇలా బీజేపీ మీద పక్క రాష్ట్రంలో దుమ్మెత్తిపోయడం విశేషం. తెలుగు వారు గట్టిగా ఉండే కర్ణాటక ప్రాంతంలో విజయశాంతి గతంలో బీజేపీ తరఫున ప్రచారం చేసేది. అప్పుడు కాంగ్రెస్ మీద ఈమె దుమ్మెత్తి పోసేది. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తూ అదే కర్ణాటకలో బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తోంది!
 
Tags:    

Similar News