రాముల‌మ్మ కోసం కాంగ్రెస్ ఆరాటం చూశారా?

Update: 2017-11-06 05:38 GMT
టాలీవుడ్ ఒక‌నాటి టాప్ హీరోయిన్‌ - ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్ప‌టికీ ఆ పార్టీతో అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న‌ మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవ‌లి కాలంలో క్రియాశీలంగా ఎక్క‌డ క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే.మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ ‘తెర’పై మళ్లీ చురుకైన పాత్రలో కనిపించబోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి మూడేళ్ళు గడిచిపోవ‌డం, 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు కాబట్టి మళ్లీ విజృంభించాలని కాంగ్రెస్ నాయకులు ఆమెను కోరుతున్నారు. రాములమ్మను మళ్లీ తెరపైకి తెచ్చి చురుకైన పాత్ర అప్పగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఆమె ఇమేజ్‌ను వాడుకోవాలన్న ఆలోచనకు పదును పెడుతోంది.

ఇందులో భాగంగా అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) దక్షిణ భారత సమన్వయకర్త - మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌ లో సమావేశం నిర్వహించిన అనంతరం పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జి ఆర్‌ సి కుంతియా - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆమెను కలిసి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ముందుకు వస్తే పార్టీ ప్రచార బాధ్యతను పూర్తిగా అప్పగిస్తామని కుంతియా ఆమెతో అన్నట్లు తెలిసింది.

కాగా, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత క్రియాశీల రాజ‌కీయాల‌కు విజ‌య‌శాంతి దూరంగా ఉన్నారు. గ‌త ఏడాది త‌మిళ‌నాడులో చోటుచేసుకున్న ప‌రిణామాల్లో చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గానికి రాములమ్మ మ‌ద్ద‌తిచ్చారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌ కు వెళ్లిన విజ‌య‌శాంతి చిన్న‌మ్మ‌ శశికళతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏ మంత‌నాలు జ‌రిగింద‌నేది చ‌ర్చకు రాలేదు. అంతకుముందుకు విజయశాంతి మెరీనాబీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని దర్శించుకొని అంజలి ఘటించారు. జయలలిత మృతి తీరని లోటని అన్నారు. ఆ త‌ర్వాత కూడా ఆమె ఎక్క‌డా మీడియాతో ముచ్చ‌టించ‌లేదు.  సినీరంగం నుంచి దూర‌మ‌వుతున్న స‌మ‌యంలోనే  తెలంగాణా రాష్ర్టం కోసం 'తల్లి తెలంగాణ' పార్టీ పెట్టిన విజయశాంతిని ఒప్పించి టీఆర్ ఎస్ లో చేర్పించడమే కాకుండా...పార్టీని విలీనం చేయించడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. టీఆర్‌ ఎస్‌ లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కు విజయశాంతి అత్యంత సన్నిహితంగానే ఉన్నారు. పలు ఎన్నికల ప్రచారాల్లోనూ రాములమ్మ కీలక పాత్ర పోషించారు. దీంతో టీఆర్‌ ఎస్‌ కు కొంత సినీ గ్లామర్‌ తోడయ్యింది. అయితే, కేసీఆర్ వ్యవహారశైలి వల్ల 2014 సాధారణ ఎన్నికలకు ముందు విజయశాంతి టీఆర్‌ ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ లో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఓటమి అనంత‌రం విజ‌య‌శాంతి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తెర‌మ‌రుగు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాల‌కు సైతం రాములమ్మ దూరంగానే ఉన్నారు. తాజా చ‌ర్చ‌ల‌తో ఆమె తిరిగి క్రియాశీలంగా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాల్లో పాల్గొన‌నున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News