జంట నగరాలుగా విజయవాడ, అమరావతి

Update: 2015-12-28 17:30 GMT
అమరావతి రాజధాని నగరం - విజయవాడ నగరాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని, భవిష్యత్తులో రెండూ కలిసి ఒక మెగా సిటీగా ఆవిర్భవిస్తాయని రాజధాని నగర తుది ప్రణాళికను రూపొందించిన సుర్బానా సంస్థ అభిప్రాయపడింది. రాజధాని ప్రాంతంలో గుంటూరు ఒక ప్రాంతీయ కేంద్రంగా ఉంటుందని తెలిపింది. కృష్ణా నదికి కుడి వైపున అమరావతి నగరం - ఎడమ వైపున విజయవాడ నగరం ఉండడంతో ఈ రెండూ జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని వివరించింది. త్వరలో నిర్మించబోయే హైస్పీడ్ రైల్ - కొత్త హైవేలు విజయవాడ - అమరావతిల నుంచే ఏర్పాటు కానున్నాయి.

అమరావతి గేట్ వే ని కూడా విజయవాడ నుంచే నిర్మిస్తున్నారు. అలాగే గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతికి కేవలం 30 నిమిషాల్లో చేరుకునేలా ఎక్స్ ప్రెస్ హైవేని నిర్మించనున్నారు. మతపరమైన పర్యాటక ప్రదేశాల సర్క్యూట్ లోకి ఈ రెండు నగరాల్లోని ప్రాంతాలనే చేర్చారు.

అలాగే, గుంటూరు - నూజివీడు - గుడివాడ - తెనాలి - సత్తెనపల్లి - నందిగామ - పామర్రు ప్రాంతాలను కలిపి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. కాలుష్య రహిత పరిశ్రమలు - సరుకు రవాణా కార్యకలాపాలు - మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలంగా వీటిని తీర్చిదిద్దుతారు. హైస్పీడు రైలు - నూతన జాతీయ రహదారి అమరావతి నగరం నుంచి వెళ్లేలా ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరాన్ని భారీగా విస్తరించాలని భావిస్తున్నారు. ఒకవైపున కొండపల్లి వరకు, మరోవైపు గన్నవరం పరిసర ప్రాంతాల వరకు విస్తరిస్తారు. అలాగే, గుడివాడ - నూజివీడు - జగ్గయ్యపేట - నందిగామ - సత్తెనపల్లి - గుంటూరు - తెనాలి - పొన్నూరు పట్టణ ప్రాంతాల అభివృద్ధిని కూడా భారీగా చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ - అమరావతి జంట నగరాలుగా భవిష్యత్తులో అభివృద్ధి చెందనున్నాయి.
Tags:    

Similar News