విజయవాడ రాజకీయమే వేరు

Update: 2020-09-05 17:00 GMT
విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రం మొత్తంలోను బెజవాడ రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే బెజవాడ రాజకీయాలకు పెట్టింది పేరు. గతంలో రౌడీయిజం మొదలు ప్రస్తుతం తిట్లదండకం వరకు నేతల తీరు భిన్నంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో వైరి పక్షాలు ఉండటం సహజం. కానీ విజయవాడ మిగతా వాటి కంటే బాగా ఎలివేట్ అవుతుంది. తాజాగా, మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే వీరి పరుషపదజాలం మరోసారి ఇక్కడి రాజకీయమే భిన్నంగా ఉంటుందని నిరూపిస్తోంది. మాటలు శృతిమించడమే కాదు, ఏకంగా బూతులు వినిపిస్తుంటాయి. సద్విమర్శలు కనిపించవు.

ఒరేయ్.. సిగ్గులేదా.. చవట.. అంటూ పదాలు ఉపయోగించు చులకనవుతుంటారు కూడా. కొడాలి నాని వంటి వారు అయితే ఏకంగా మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై బిచ్చగాడు అంటూ ధ్వజమెత్తుతుంటారు. ఇటీవల కొడాలి నానిపై దేవినేని మండిపడ్డారు. దానికి స్పందించిన కొడాలి దేవినేని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, తనను ప్రతిసారి బూతుల మంత్రి అంటాడని, దేవినేని తండ్రి సోడాలు అమ్ముకోలేదా అని నిప్పులు చెరిగారు. నన్ను లారీ క్లీనర్ అంటుండాని, ఎవరో ఒక లారీ డ్రైవర్, లారీ క్లీనర్ కంచికచర్ల హైవేపై నిన్ను తొక్కిస్తారని దుయ్యబట్టారు.

బూతుల మంత్రి ఎవరో తెలుసునని దేవినేని కూడా ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్రంగానే స్పందించారు. కొడాలి నాని మనిషిలా మాట్లాడటం లేదని, చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయిలేదంటున్నారు. వీరుమాత్రమే కాదు, బెజవాడ నాయకులు మిగతా నేతలతో పోలిస్తే దూకుడుగా ఉంటారు. కొడాలి నాని నోరు తెరిస్తే బూతులు అని తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తుంటారు. అలాగే, దేవినేని ఉమ, బోండా ఉమ, కేశినేని నాని, పీవీపీ, మల్లాది విష్ణు వంటి నేతలు ఘాటుగా మాట్లాడటం లేదా దూకుడుగా ఉండటం తెలిసిందే.


Tags:    

Similar News