ల‌గ‌డ‌పాటి ఎంట్రీతో..కేశినేనికి మొండిచెయ్యేనా?

Update: 2017-04-15 12:07 GMT
న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌ కు పొలిటిక‌ల్ కేపిట‌ల్‌ గా మారిన విజ‌య‌వాడ‌లో ఇప్పుడు ఒకే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని... వార‌స‌త్వంగా వ‌చ్చిన ట్రావెల్స్ వ్యాపారాన్ని ఇప్పుడు మూసేసుకున్న‌ట్లుగానే... వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయంగానూ సైలెంట్ కావాల్సిందేనా? అన్న కోణంలో జ‌రుగుతున్న ఆ చ‌ర్చ అధికార పార్టీ శ్రేణుల‌ను తీవ్ర అయోమయానికి గురి చేస్తోంది. పార్టీలో చాలా కాలం నుంచే ప్రాథ‌మిక స‌భ్య‌త్వం ఉన్న నాని... ఎప్పుడు ఎన్నిక‌ల్లో పోటీ చేద్దామ‌ని భావించినా కూడా కుద‌ర‌లేదు. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల్లో అన్ని అంశాలు క‌లిసిరావ‌డంతో కేశినేనికి చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.

అయితే త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి టికెట్ ఇచ్చిన చంద్రబాబు న‌మ్మ‌కాన్ని కేశినేని ఏమాత్రం వ‌మ్ము చేయ‌లేదు. హోరీహోరీగా జ‌రిగిన నాటి ఎన్నిక‌లో కేశినేని విజ‌యం సాధించ‌గా, బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఆయ‌న కీల‌క భూమిక పోషిస్తార‌ని అంతా అనుకున్నారు. అయితే ఒకే ఒక్క ఘ‌ట‌న‌తో కేశినేనిని జీరో చేసేందుకు టీడీపీ అధిష్ఠానం రంగం సిద్ధం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మొన్న త‌న ట్రావెల్స్‌ కు సంబంధించి ఓ వ్య‌వ‌హారంలో ర‌వాణా శాఖ కార్యాల‌యానికి వెళ్లిన కేశినేని... అక్క‌డ ర‌వాణాశాఖ అధికారుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇక కేశినేనికి తోడుగా వెళ్లిన ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు - ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌లు అధికారుల‌పై కాస్తంత దురుసుగానే ప్ర‌వ‌ర్తించారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు... ఈ ముగ్గురిని త‌న వ‌ద్ద‌కు పిలిపించుకుని మంద‌లించారు. అంతేకాకుండా... ఎక్క‌డ త‌ప్పు చేశారో, అక్క‌డికే వెళ్లి, ఎవ‌రిని అవ‌మానించారో వారికి సారీ చెప్పి రావాలంటూ గ‌ద్దించారు. సాధార‌ణంగా కాస్తంత మృదు స్వ‌భావి అయిన కేశినేని ఈ ఘ‌ట‌నతో ఒక్క‌సారిగా షాక్ తిన్నార‌ట‌. అయితే పార్టీ అధినేత నిర్ణ‌యాన్ని ధిక్క‌రించే మ‌న‌స్తత్వం లేని కేశినేని ర‌వాణా శాఖ అధికారుల‌కు సారీ చెప్పేశారు. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు గానీ... ఏళ్లుగా స‌క్సెస్‌ ఫుల్‌ గా జ‌రుగుతూ వ‌స్తున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేస్తున్న‌ట్లు కేశినేని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చ‌ర్చ‌కే తెర తీసింది. దీనిపై ఓ ప‌క్క చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే... విజ‌యవాడ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క మ‌లుపుగా భావిస్తున్న ఘ‌ట‌న జ‌రిగింది.

ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి... రాష్ట్ర విభ‌జ‌న‌ను అడ్డుకోలేక‌పోయాన‌న్న బాధ‌తో రాజ‌కీయాల‌నే వ‌దిలేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన విజ‌యవాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ నిన్న చంద్ర‌బాబుతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాజ‌కీయంగా రీఎంట్రీ కోసం ల‌గ‌డ‌పాటి చేస్తున్న య‌త్నాల‌కు చంద్ర‌బాబు స‌రేన‌న్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అంతేకాకుండా ల‌గ‌డ‌పాటి డిమాండ్ మేర‌కు విజ‌య‌వాడ పార్ల‌మెంటు టికెట్‌ ను ఆయ‌న‌కే ఇచ్చేందుకు కూడా బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న పుకార్లు కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి.

ఈ పుకార్లే నిజ‌మైతే... విజ‌యవాడ ఎంపీగా ఉన్న కేశినేని ఎక్క‌డికి పోవాల‌న్న‌దే... ఇప్పుడు విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌. ఓ ప‌క్క రాజ‌కీయాల కోసం వ్యాపారాన్నే వ‌దిలేసుకున్న కేశినేని... ల‌గ‌డ‌పాటికి బాబు రెడ్ కార్పెట్ ప‌రిస్తే... రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకోక త‌ప్ప‌దా? అన్న కోణంలో బెజ‌వాడ తెలుగు త‌మ్ముళ్లు తెగ మ‌ధ‌న‌ప‌డిపోతున్నారు. మ‌రి ఈ చ‌ర్చ‌కు టీడీపీ అధిష్ఠానం ఏ రీతిన ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News