ఇక్కడ మన మెగాస్టార్.. అక్కడ కెప్టెన్

Update: 2016-05-19 09:43 GMT
2004లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తర్వాతి ఐదేళ్లలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగానే ఉన్నట్లుగా అంచనా వేశారు. మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమి కట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలడా అని సందేహించారంతా. కానీ వైఎస్ అనూహ్యంగా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇక్కడ తేడా ఏంటో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేశాడు. ప్రతిపక్షాల ఓటు బ్యాంకును దెబ్బ తీసి తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆ ఎన్నికల్లో మహాకూటమి 2 శాతం లోపు ఓట్లతో అధికారానికి దూరమైంది. మరోవైపు చిరంజీవి పార్టీ 17 శాతం దాకా ఓట్లు సంపాదించింది. ప్రజారాజ్యం లేకుంటే ఈ ఓట్లలో చాలా వరకు మహాకూటమికి పడేవేమో. అధికారం వారికే దఖలు పడేదేమో.

ఇప్పుడీ ప్రస్తావన ఇప్పుడెందుకూ అంటే.. తమిళనాట విజయ్ కాంత్ సైతం ఈసారి చిరంజీవి పాత్రే పోషించాడు. చిరు స్థాయిలో కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును బాగా చీల్చేశాడు. గత పర్యాయం డీఎంకేకు వ్యతిరేకంగా జయలలితతో జట్టు కట్టడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా ఈ కూటమికే దఖలు పడింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల అనంతరం కొన్ని నెలలకే జయకు టాటా చెప్పేసిన విజయ్ కాంత్.. ఈసారి డీఎంకే స్నేహహస్తం చాటినా అందుకోలేదు.

సొంతంగా అధికారంలోకి వచ్చేద్దామని.. ముఖ్యమంత్రి అయిపోదామని చిన్నా చితకా పార్టీల్ని కూడగట్టి ఓ కూటమి ఏర్పాటు చేశాడు. ఐతే ఆయన పార్టీ అభ్యర్థులకు ఓట్లయితే వచ్చాయి కానీ.. సీట్లు రాలేదు. స్వయంగా విజయ్ కాంత్ ఓటమి పాలవుతున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేయడం వల్ల డీఎంకేకు గండి పడింది. జయకు లాభం చేకూరింది. మొత్తానికి తాను మునిగి.. డీఎంకేను కూడా ముంచేశాడు కెప్టెన్. గత పర్యాయం జయకు మిత్రుడిగా ఉండి ఆమె అధికారంలోకి రావడానికి సాయపడ్డ విజయ్ కాంత్.. ఈసారి శత్రువుగా మారి ఆమెకు సాయపడ్డాడు. కాబట్టి అమ్మ కెప్టెన్ కు రుణపడి ఉండాలి.
Tags:    

Similar News