కెప్టెన్ విజయ్ కాంత్.. జస్ట్ మూడో స్థానమే

Update: 2016-05-19 06:28 GMT
‘‘తమిళనాడులో నేనే హీరో.. కరుణానిధి విలన్.. జయలలిత లేడీ విలన్’.. ఓ జాతీయ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలివి. అంతటితో ఆగాడా.. తన నేతృత్వంలోని కూటమే తమిళనాడులో అధికారంలోకి రాబోతోందని.. తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానని కూడా బీరాలు పలికాడు కెప్టెన్. ఐతే ఆయన పార్టీకి ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కేలా లేదు. స్వయంగా విజయ్ కాంతే ఓటమి చవిచూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విజయ్ కాంత్ పోటీ చేసిన ఉళుందుర్ పేట్ట నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. అక్కడ అన్నాడీఎంకే ఆధిక్యంలో ఉండగా.. రెండో స్థానంలో డీఎంకే ఉంది.

2006లో డీఎండీకే పార్టీ పెట్టి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్.. తాను ఒక్కడు మాత్రమే గెలిచాడు. అయినా నిబ్బరం కోల్పోకుండా రాజకీయాలు నడిపిన కెప్టెన్ గత ఎన్నికల్లో జయలలితతో పార్టీతో పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలు సాధించాడు. గత పర్యాయం ఆయన పార్టీకి 28 సీట్లు దక్కడం విశేషం. ఐతే జయలలితతో విభేదాల కారణంగా ఏడాది తిరక్కుండానే ఆమెకు టాటా చెప్పేశాడు విజయ్ కాంత్.

ఐతే గత మూణ్నాలుగేళ్లలో విజయ్ కాంత్ ఎంత భ్రష్టు పట్టాలో అంతా పట్టాడు. తాగి మీటింగుల్లో అసభ్యంగా మాట్లాడ్డం.. యోగా వీడియోలో వెకిలి చేష్టలు చేయడం.. మీడియాను తిట్టిపోయడం.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం.. ఇలా విజయ్ కాంత్ తన ఇమేజ్ ను తానే చాలా డ్యామేజ్ చేసుకున్నాడు. చివరికి రజినీకాంత్ మీద అనవసర వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. దీనికంతటికీ ఈ ఎన్నికల్లో ఫలితం అందుకుంటున్నాడు కెప్టెన్.
Tags:    

Similar News