తీర్మానం.. ఆ ఎమ్మెల్యేతో ఎవరూ మాటాడొద్దు!

Update: 2016-10-14 04:33 GMT
ఎమ్మెల్యే తో మాట్లాడొద్ద్దని ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగానూ, కొంతమందికి ఆనందంగానూ అనిపిస్తోన్న సంఘటన ఆర్మూరులో జరిగింది. ప్రజాసేవకులమని చెప్పుకునే రాజకీయ నాయకులు చెప్పిన మాట చేసి చూపించకపోతే, ప్రజల కోరిక మేరకు పనిచేయకపోతే ప్రజలు తిరగబడే రోజు రావాలని, నడిరోడ్డుపై ప్రశ్నించే సమయం రావాలని కోరుకుంటుంటారు. అయితే తాజాగా ఈ గ్రామ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి తమ ఎమ్మెల్యేతో మాట్లాడకూడదని తీర్మానం చేసుకున్నారు.

ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే ఆలూరు గ్రామం - మండలం కాలేకపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ మాట్లాడకూడదని ఆ గ్రామ ప్రజలు తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా - ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో ఆలూరు గ్రామంలో ఎవరూ మాట్లాడొద్దని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా... ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాలో ఆలూరు మండలంగా ఉందని, రాజకీయ కారణాల వల్ల సమీప గ్రామాల వారు తీర్మానాలు ఇవ్వలేదని, కానీ... పక్క నియోజకవర్గాల్లో మాత్రం తీర్మానాల్లో లేకున్నా మండలాలు ఇచ్చారని వారు చెబుతున్నారు. తీర్మానాలు ఇవ్వలేదనే సాకు చూపించి తమకు అన్యాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

ఇంత కీలక సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లడం ఈ తీవ్ర అన్యాయానికి కారణమని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ సమక్షంలో సమావేశమైన ప్రజలంతా అవసరానికి అందుబాటులో ఉండకుండా, సరిగ్గా సమయం చూసుకుని విదేశాలకు వెళ్లిపోవడం ఏమిటనే బాదతో ఈ తీర్మానం చేశారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News