ఎమ్మెల్యే కారును అడ్డుకొని.. గ్రామ‌స్తుల ఆందోళ‌న‌!

Update: 2021-07-24 14:30 GMT
చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు ఎన్నిక‌ల ముందు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌జ‌లు ఏం అడిగినా.. అన్నింటికీ ‘ఓ.. ఎస్’ అంటారు. మారెమ్మ, మైసమ్మ నుంచి దేవుళ్లందరి మీదా ప్రమాణాలు చేస్తారు. కానీ.. గెలిచిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోతుంది. చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు తాము ఇచ్చిన వాగ్దాన‌మే గుర్తు లేద‌న్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తారు. అయితే.. ప్ర‌జ‌లు కూడా చాలా మంది వ‌దిలేస్తారు. కానీ.. కొంద‌రుంటారు. ఎక్క‌డ దొరికితే అక్క‌డ ప‌ట్టుకొని నిల‌దీస్తారు? ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్ర‌శ్నిస్తారు.

తెలంగాణ రాష్ట్రం జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ గులాబీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఆయ‌న కారును అడ్డుకున్న ప్ర‌జ‌లు త‌మ‌కు ఇచ్చిన హామీ ఏమైంద‌ని అడిగారు. ఆయ‌న ఏదో స‌ర్దిచెప్ప‌బోతే అంగీక‌రించేది లేదంటూ ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. దీంతో.. కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ.. ఆయ‌న ఇచ్చిన హామీ ఏమంటే...

త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ర‌త్న‌తండ్రా గ్రామానికి రోడ్డు వేయిస్తాన‌ని ఎన్నిక‌ల వేళ ముత్తిరెడ్డి హామీ ఇచ్చారు. ఆయ‌న గెలిచారు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్ప‌టికి రెండున్న‌రేళ్లు దాటిపోయింది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ గ్రామానికి రోడ్డు వేయించ‌లేదు. తాజాగా.. న‌ర్మెట్ట మండ‌లం మచ్చుప‌హాడ్ రిజ‌ర్వు ఫారెస్టులో మొక్క‌లు నాటేందుకు వ‌చ్చారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.

ఈ విష‌యం తెలుసుకున్న ర‌త్నతండా గ్రామ‌స్తులు.. ఆగ‌పేట గ్రామంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. త‌మ గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తాన‌ని చెప్పి, ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఇప్పించ‌లేద‌ని నిల‌దీశారు. కారుకు అడ్డంగా రోడ్డుపై ధ‌ర్నాకు సైతం సిద్ధ‌మ‌య్యారు. దీంతో.. పోలీసులు వారిని ప‌క్క‌కు త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. దీంతో.. కారు దిగి వ‌చ్చిన ఎమ్మెల్యే.. త‌ప్ప‌కుండా రోడ్డు వేయిస్తాన‌ని స‌ర్దిచెప్పి, వెళ్లిపోయారు.
Tags:    

Similar News