జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆ గ్రామాలు ఇచ్చిన షాక్ ఇదే!

Update: 2022-07-25 05:10 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను చూసి వేరే రాష్ట్రాల వారు కూడా ఏపీలో నివాసం ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని వైఎస్సార్సీపీ నేత‌లు ప‌లుమార్లు ఊరూవాడా ఘ‌నంగా చెప్పుకున్నారు. తాము ఏపీకి చెందిన‌వారం కాక‌పోవ‌డం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాలు ప్ర‌జ‌లు కూడా ఆందోళ‌న చెందుతున్నార‌ని.. అవ‌కాశం ఉంటే ఏపీకి వ‌చ్చేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చే సంక్షేమ ప‌థ‌కాలు పొందాల‌ని కోరుకుంటున్నార‌ని వైఎస్సార్సీపీ నేత‌లు గొప్ప‌గా ప్రచారం చేసుకున్నారు. అయితే పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ అనే సామెత‌ను నిజం చేస్తూ ఏపీ ప్ర‌జ‌లే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, వైఎస్సార్సీపీ నేత‌ల‌కు తీవ్ర షాక్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం గోదావ‌రి న‌ది వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని న‌దీ తీర ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జించిన‌ప్పుడు తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలో ఉన్న ఏడు మండ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విలీనం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి వీటికి ముంపు స‌మ‌స్య ఉంది కాబ‌ట్టి ఆంధ్రాలో ఉంటే ఇబ్బంది ఉండ‌ద‌ని.. ఆ మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, వ‌ర‌రామచంద్ర‌పురం, భ‌ద్రాచ‌లం (టౌన్ మిన‌హాయించి), చింతూరు, ఎట‌పాక‌, కూన‌వ‌రం మండ‌లాలు ఇందులో ఉన్నాయి.  

అయితే ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో ఈ విలీన మండ‌లాల ప్ర‌జ‌లు చుక్కలు చూస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మండ‌లాల గ్రామాల్లో వ‌ర‌దతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. ఇళ్లు పూర్తిగా మునిగిపోయి.. తిన‌డానికి తిండిలేక‌, తాగ‌డానికి నీరు లేక‌, పున‌రావాస కేంద్రాల ఆచూకీ లేక ప్ర‌జ‌లు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆయా గ్రామాల ప్ర‌జ‌లు త‌మ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని తాజాగా ధ‌ర్నాకు దిగారు. ఐదు పంచాయ‌తీల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ ఊళ్ల‌ను తిరిగి తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని ఏపీలో ఉండ‌బోమంటూ మూకుమ్మ‌డిగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగారు. భద్రాచలంలో ఆదివారం తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలు ఆందోళన నిర్వహించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

తమ గ్రామాల్ని తెలంగాణలో కలిపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయా గ్రామాల ప్రజలు అన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో గత 15 రోజులుగా, సుమారు 40 అడుగుల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ ఐదు గ్రామ పంచాయతీల్లో ఒకటైన యటపాకలో కరకట్ట పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. మరోవైపు ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. అన్ని పార్టీలకు చెందిన నేతలు, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు.

తమ గ్రామాలకు అర కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలం ఉందని, అందువల్ల తమను తెలంగాణలో కలిపితే సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు కూడా వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తమ గ్రామాల్ని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, వైఎస్సార్సీపీ నేత‌ల‌కు చుక్కెదురు అయ్యింద‌ని అంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న ఎలా ఉందో చెప్ప‌డానికి ఈ విలీన గ్రామాల ప్ర‌జ‌లు చాల‌ని చెబుతున్నారు. వేరే రాష్ట్రం వాళ్లు జ‌గ‌న్ ఇచ్చే ప‌థ‌కాలు పొంద‌డానికి ఏపీలో పుట్టి ఉంటే బాగుండేద‌ని అనుకుంటున్నార‌ని గొప్ప‌లు చెప్పుకున్న వైఎస్సార్సీపీ నేత‌లు ఇప్పుడేమంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News