చిత్ర‌పురిలో రాజ‌కీయ నాయ‌కులు అధికారుల‌కు విల్లాలు?

Update: 2021-06-28 12:30 GMT
తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ‌లో 24 శాఖ‌ల కార్మికుల కోసం నిర్మించిన చిత్ర‌పురి కాల‌నీలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై చాలా కాలంగా ఆరోప‌ణ‌లు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లుమార్లు సంబంధిత‌ అధికారులు విచారించినా కానీ అక్ర‌మాల‌పై చ‌ర్య‌లేవీ తీసుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే.. ఈ స్కామ్ లో ఉన్న ప‌లువురు పెద్ద‌లేన‌ని ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో క‌థ‌నం సంచ‌ల‌నంగా మారింది. చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సినీ కార్మికులతో పాటు పలువురు రాజ‌కీయ‌ నాయ‌కుల‌కు చోటు క‌ల్పించ‌డం ఒక వివాద‌మైతే వారి పేరిట ఒక్కొక్కరికి నాలుగైదు ఫ్లాట్లు కేటాయించ‌డంపైనా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయని స‌ద‌రు ప‌త్రిక వెల్ల‌డించింది. చిత్ర‌పురిలో బ‌డాబాబులు ఎవ‌రెవ‌రు ఉన్నారు? అన్న‌దానిపై లోతైన అధ్య‌య‌నం చేసిన స‌ద‌రు ప‌త్రికా క‌థ‌నం అందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

2018 ఎన్నికల్లో ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఆయన భార్యకు చిత్ర పురి హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వాలున్నాయి. ఆయ‌న‌కు త్రిపుల్ బెడ్ రూమ్‌ ప్లాట్ ఉంది. దీనిపై అద్దెలు పొందుతున్నారు. అస‌లు వీరికి 24శాఖ‌ల‌తో ఏ సంబంధం లేదు. వీరికి సినిమాల్లో న‌టించిన‌ది లేదు. ఏ సంఘంలోనూ స‌భ్య‌త్వాలు కూడా లేవు.

పాత్రికేయుడిగా ప‌ని చేసి త‌ర్వాత సొసైటీ స‌భ్యుడిగా చేరి ర‌చ‌యిత‌ల సంఘం మెంబ‌ర్ షిప్ కార్డ్ తో చిత్ర‌పురిలో ఇల్లు పొందిన ఓ ప్ర‌ముఖుడు ఉన్నారు. హెచ్.ఐ.జీ డూప్లెక్స్ ని ఆయ‌న ప‌రం చేశారు. తెలంగాణ‌ రాష్ట్రంలో ఓ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సైతం చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం పొందారు. ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీ  కీల‌క వ్య‌క్తి అయిన ఆయ‌నకు సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదు.  హెచ్ ఐజీ డూప్లెక్స్‌ విల్లాను వారికి కేటాయించార‌ని తెలిసింది. వేరొక రాజ‌కీయ పార్టీ మూడు రాష్ట్రాల ఇన్ ఛార్జికి హౌసింగ్ సొసైటీ స‌భ్య‌త్వంతో పాటు ట్రిపుల్ బెడ్ రూమ్ కేటాయించార‌ట. సదరు నేత ముగ్గురు బంధువులు కూడా ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు పొందారు. ఎస్‌.బీ.ఐ గన్ ఫౌండ్రీ బ్యాంకులోని ఓ అధికారికి హెచ్‌.ఐ.జీలోనే 3 ప్లాట్లు ఉన్నాయి. అధికార పార్టీ న్యూస్‌ చానల్ వ్య‌క్తికి కూడా ఫ్లాట్ కేటాయించార‌ట‌.

దీనిపై ఇప్ప‌టికే కోఆపరేటివ్‌ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు లు అందాయి. కానీ చర్యలు చేపట్టిందే లేదు. ఏడాది కాలంగా చిత్రపురి అవకతవకలపై విచారణ సాగుతున్నా.. రిజ‌ల్ట్ మాత్రం శూన్యం. మూడు నెలల్లో విచారణ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయినా ఇంతవరకు ఇవ్వలేదని తెలిసింది. ఇక‌పోతే చిత్ర‌పురి కాల‌నీలో సింగిల్ - డ‌బుల్ బెడ్ రూమ్స్ - రోహౌస్ లు డూప్లెక్స్ విల్లాలు అన్నిటా అక్ర‌మాలున్నాయి. వీట‌న్నిటిపైనా సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News