అందుకే కొండా సురేఖకు టికెట్ రాలేదట..

Update: 2018-09-08 10:39 GMT
కొండా సురేఖ చాలా గ్యాప్ తర్వాత శనివారం విలేకరుల ముందుకు వచ్చారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ లో అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఆమె అసమ్మతి కలకలం రేపింది. మీడియా అంతా ఆమెపై ఫోకస్ చేసి కథనాలు వండి వార్చి వైరల్ చేశారు.

కొండా సురేఖ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో తాజాగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా నేతలు స్పందించారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొండా దంపతులు రాజకీయంగా సమాధి అవుతున్న సందర్భంలో తనే స్వయంగా కేటీఆర్ తో మాట్లాడి వారిని పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. ఉద్యమ సమయంలో వారిపై రాళ్ల వర్షం కురిస్తే.. కేసీఆరే రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. కొండా దంపతులు భూపాలపల్లి - పరకాల ప్రాంతాల్లో పర్యటించి పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారని వినయ్ భాస్కర్ ఆరోపించారు. ముందు నుంచే కాంగ్రెస్ లోకి వెళ్లాలని వారు చూశారని.. దుమ్ముంటే బహిరంగంగా వెళ్లాలని సవాల్ చేశారు. సర్వే ప్రకారమే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని.. కొండ దంపతుల చీకటి వ్యవహారాలు సమయం వచ్చినప్పుడు తాము బయటపెడతామని స్పష్టం చేశారు

ఇక ప్రజలకు కొండా సురేఖ అందుబాటులో ఉండకపోవడం వల్లనే ఆమెకు టికెట్ ఇవ్వలేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్పష్టం చేశారు. వారు కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  ఇక వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కొండా దంపతులకు టిక్కెట్ ఇవ్వకపోవడం మంచి నిర్ణయమేనని టీఆర్ ఎస్ నేత - మాజీ ఎంపీ గుండు సుధారాణి వ్యాఖ్యానించారు. పార్టీపై వారి ఆరోపణలు అర్థరహితమన్నారు. టీఆర్ ఎస్ లో గ్రూపులు లేవని.. కేసీఆర్ ఒక్కడే నాయకుడని స్పష్టం చేశారు.
Tags:    

Similar News