ఆట తగ్గినా.. వన్నె తరగని ఆదరణ

Update: 2022-08-23 01:30 GMT
విరాట్ కోహ్లి ప్రస్తుతం ఏ ఫార్మాట్ లోనూ భారత్ కు కెప్టెన్ కాదు. 34 నెలలుగా 34 ఏళ్ల కోహ్లి సెంచరీ లేదు. గత మూడు నెలల్లో కనీసం మూడు అంతర్జాతీయ మ్యాచ్ లైనా ఆడలేదు.. మూడు నెలల్లో జరుగబోయే టి20 ప్రపంచ కప్ లో భారత జట్టులో ఉంటాడో లేడో కూడా సందిగ్ధమే.. ఇవన్నీ పక్కనపెడితే.. కొన్నాళ్లుగా విరాట్ అభిమానుల సంఖ్య తగ్గుతోంది. విమర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కుర్రాళ్ల దూకుడుతో కోహ్లి ప్రభ మసకబారుతోంది అన్న వ్యాఖ్యలూ ఉన్నాయి. కానీ, అదంతా అవాస్తవమని తేలింది.

ఫామ్ లో ఉన్నవారిని మించి

కోహ్లి ఫామ్ లో లేడనేది వాస్తవం. పరుగుల కోసం అతడు తాపత్రయపడుతున్నదీ నిజమే. చాలాకాలంగా సెంచరీ కొట్టకపోవడం, సాంకేతికంగా చిక్కుల్ల్లో ఉండడం ఇవన్నీ నిజాలే. కానీ, అతడి ఆదరణ మాత్రం చెక్కు చెదరలేదు. సోషల్ మీడియా, ఇతర వేదికలపై ఒర్మాక్స్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్నది కోహ్లికే అని ఈ సర్వే స్పష్టం చేసింది. అది కూడా జూలై నెల్లో నిర్వహించిన సర్వేలో తేలడం విశేషం.

అంటే.. ఇప్పటికీ కోహ్లినే దేశంలో నంబర్ వన్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్. అతడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో పాటు సహచరులు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలనూ వెనక్కునెట్టాడు. వాస్తవానికి రోహిత్, రాహుల్, పాండ్యా ఇటీవలి కాలంలో కోహ్లి కంటే మెరుగ్గా ఉన్నారు. ఈ ఏడాదిలోనే రోహిత్ అన్ని ఫార్మాట్లలో భారత్ కు కెప్టెన్ అయితే, రాహుల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. పాండ్యా పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. అయినా వీరి కంటే కోహ్లికే ఎక్కువ ఆదరణ ఉండడం గమనార్హం.

పీవీ సింధూతో పాటు క్రికెటేతర ఆటగాళ్ల కంటే కూడా

క్రికెట్ లో కోహ్లిని కొట్టే వారు లేరని.. అందుకే అతడికి ఆదరణ అని అనుకున్నా.. ఇతర క్రీడాకారుల కంటే కూడా అతడే ఎక్కువ పాపులర్గా నిలిచాడు. ప్రస్తుతం ఫుట్ బాల్ ప్రపంచం దిగ్గజ ఆటగాళ్లుగా భావించే క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), లయోనల్ మెస్సీ (అర్జెంటీనా), భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా కోహ్లి కంటే వెనుకంజలోనే ఉండడం విశేషం. ఆఖరికి కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణంతో మెరిసిన బ్యాడ్మింటన్ తార, తెలుగు తేజం పీవీ సింధూ కూడా కోహ్లి కంటే పాపులారిటీలో వెనుకనే కావడం గమనార్హం. దీన్నిబట్టి ఫామ్ పోయినా.. కోహ్లిపై అభిమానులకు ఇంకా నమ్మకం చెక్కుచెదరలేదని స్పష్టమవుతోంది. కాగా, కోహ్లి భవిష్యత్తుపై పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లి భవిష్యత్తు 'అతడి చేతుల్లోనే ఉంది' అని స్పందించాడు. కొహ్లీ దాదాపు ఐదు వారాల విశ్రాంతి తర్వాత తిరిగి మైదానంలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో 28న తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ శతకం చేసి 1,000 రోజులు దాటిపోయింది. ఇదే విషయాన్ని ఓ అభిమాని అఫ్రిది వద్ద ప్రస్తావించాడు. దీనికి అఫ్రిది స్పందిస్తూ.. ''పెద్ద ఆటగాళ్ల సత్తా కష్టకాలంలోనే తెలుస్తుంది'' అని వ్యాఖ్యానించాడు. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌కు మంచి రికార్డు ఉంది. అతడు 77.75 సగటుతో 311 పరుగులు చేశాడు.

మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ పరుగుల్లో 35 ఫోర్లు, ఐదు సిక్స్‌లు ఉన్నాయి. వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనలకు విశ్రాంతి తీసుకొన్న కోహ్లీ రెట్టింపు ఉత్సాహంతో ఆసియాకప్‌లో రాణిస్తాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.
Tags:    

Similar News