పందెం కాసుకోండి.. సంక్రాంతి కోడి పుంజు కోహ్లి

Update: 2023-01-16 11:15 GMT
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. గత సెప్టెంబరులో ఆసియా కప్ లో తొలి టి20 సెంచరీ అందుకున్న అతడు తాజాగా నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు బాదేశాడు. దీంతో మొత్తమ్మీద శతకాల సంఖ్యను 74కు పెంచుకున్నాడు. వన్డేల్లో 45 సార్లు మూడంకెల సంఖ్యను దాటాడు. కాగా వీటిలో మూడుసార్లు సంక్రాతి రోజు చేసిన సెంచరీలే ఉండడం విశేషం. ఒకసారి టెస్టుల్లో శతకం చేశాడు. జనవరి 15.. మూడంకెలు ఉండాల్సిందే..

సంక్రాంత్రి అంటే భోగి, సంక్రాంతి, కనుమ.. వీటితో పాటు ఇకపై విరాట్ కోహ్లి సెంచరీని కూడా కలుపుకోవాలేమో? ఎందుకంటే గత ఏడేళ్లలో అతడు నాలుగుసార్లు సెంచరీ చేశాడు. మిగతా మూడు సీజన్లలో రెండు జరగలేదు. ఓసారి అతడు జట్టులో లేడు. అంటే.. సంక్రాంతి రోజున 2017 నుంచి బరిలో దిగిన ప్రతిసారీ కోహ్లి సెంచరీ బాదేయడం విశేషం. తాజాగా ఆదివారం తిరువనంతపురంలో శ్రీలంకపై జరిగిన మూడో వన్డేలో కోహ్లి విశ్వరూపం ఏమిటో చూశారు. కెరీర్ లో రెండో అత్యధిక స్కోరుతో అతడు చెలరేగిన తీరు అత్యద్భుతం. పండుగ రోజు బంధుమిత్రులతో ఇంటి పట్టున ఉన్నవారికి కోహ్లి ఇన్నింగ్స్ మధురానుభూతిని మిగిల్చిందనడంలో సందేహం లేదు.

2017లో మొదలు.. కోహ్లి సంక్రాతి సెంచరీల ప్రస్థాన 2017లో మొదలైంది. ఆ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అతడు 122 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 351 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. అయితే, భారత్‌ దానిని సునాయాసంగా ఛేదించింది. కోహ్లితో పాటు కేదార్‌ జాదవ్‌ (120) మెరవడంతో గెలుపు సాధ్యమైంది. కాగా, దక్షిణాఫ్రికాతో 2018లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా విరాట్‌ జనవరి 15నే సెంచరీ చేశాడు. 153 పరుగులతో ఆ మ్యాచ్‌లో అదరగొట్టాడు.

సెంచూరియన్‌లో జరిగిన ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తడబడి ఓడిపోయింది. అయినా విరాట్‌ శతకం ఓ అద్భుతంగా నిలిచిపోయింది. 3వ సెంచరీ విషయానికొస్తే ఆస్ట్రేలియాపై సాధించాడు. జనవరి 15, 2019న ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు. 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ను విరాట్‌ సెంచరీ చేసి గెలిపించాడు. నాలుగో సెంచరీ చూస్తే.. శ్రీలంకతో మూడో వన్డేలో (జనవరి 15,2023) బాదాడు. 166 పరుగుల అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అయితే టీమిండియా 2020, 2022లో  సంక్రాంతి సీజన్‌లో మ్యాచ్‌లు ఆడలేదు. 2021లో ఆడినా ఆ జట్టులో విరాట్‌ లేడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News