వేటు కత్తి అంచున కోహ్లి.. కనీసం టి20లకైనా..?

Update: 2022-07-10 14:06 GMT
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి అంతా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా 2022 అతడికి ఏమాత్రం అనుకూలంగా లేదు. 2020, 2021లోనూ ఇలాంటి గడ్డు స్థితే ఉన్నా.. మరీ ఇప్పుడున్నంతగా మాత్రం కాదు. 2022 ప్రారంభంలో బీసీసీఐతో వివాదం నేపథ్యంలో టి20 కెప్టెన్సీ (వన్డే కెప్టెన్సీ కూడా) వదిలేసిన విరాట్.. టెస్టు సారథ్యానికీ గుడ్ బై చెప్పాడు.ఇదంతా పరిమిత ఓవర్ల కెప్టెన్సీలో వన్డేలకు మాత్రమే కొనసాగుతానని అతడు చెప్పడంతో వచ్చింది. బోర్డు మాత్రం రెండింటికీ (టి20, వన్డే) సారథ్యం వదులుకోవాలని కోరడం వివాదం రేపింది. చివరకు బోర్డు చెప్పినదే నిజమైనా.. టెస్టుల్లోనూ కెప్టెన్సీని వదిలేసిన కోహ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు జట్టులో.. అంటే కనీసం టి20 జట్టులో నుంచి అయినా అతడిని తప్పించే అవకాశం కనిపిస్తోంది.

టి20లకు పోటాపోటీ..

ఒక కేఎల్ రాహుల్, ఒక సూర్యకుమార్ యాదవ్, ఒక ఇషాన్ కిషన్, ఒక దీపక్ హుడా.., ఒక శ్రేయస్ అయ్యర్.. ఇదీ టి20ల్లో అదరగొడుతున్న భారత యువతరం. వీరిలో ఏ ఇద్దరికో మాత్రమే చోటు ఉంటుంది. రాహుల్ గాయంతో అందుబాటులో లేకున్నా.. శనివారం నాటి మ్యాచ్ లో దీపక్ హుడా, అయ్యర్ ఇద్దరినీ పక్కన పెట్టారు. దీపక్ ఇటీవల మూడు మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడాడు. సూర్య హిట్టింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయ్యర్ ఉన్నత స్థాయి బ్యాట్స్ మన్. రాహుల్ వస్తే కిషన్ బెంచ్ ఎక్కాల్సిందే. అంటే.. టీమిండియాలో పోటీ ఏ స్థాయిలో
ఉందో తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లి స్థానం అంత భద్రమైనదేనని చెప్పలేం. పైగా విరాట్ కు 33 ఏళ్లొచ్చాయి. రోహిత్ కూ 35 ఏళ్లున్నా.. అతడిప్పుడు కెప్టెన్. కాబట్టి అందరిలోనూ విరాట్ కే టి20 జట్టలో చోటు కష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ కోహ్లి పెద్దగా ఆడిందేమీ లేదు. సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నా.. లేక కోహ్లినే స్వచ్ఛందంగా నిర్ణయించుకుని టి20ల నుంచి వైదొలగినా ఆశ్చర్యం లేదు.

కుర్రాళ్లు కుమ్మేస్తున్నా.. కోహ్లి ఎందుకిలా..?

రెండేళ్లుగా కోహ్లి ఫామ్ దిగజారుతోంది. సాధారణ బంతులకూ ఔటవుతున్నాడు. శనివారం ఇంగ్లండ్ తో రెండో టి20లోనూ అరంగేట్ర బౌలర్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్ లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. కుర్రాళ్లు నేనంటే నేనని పోటీ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లికి ఇక ఖో తప్పదు. కాగా, కోహ్లి వంటి దిగ్గజ బ్యాట్స్ మన్ ను తప్పించడం సెలక్టర్లకైనా సవాలే. వాస్తవానికి విరాట్ ను ఎందులోనూ తక్కువ చేయలేం. అతడి స్థాయి అలాంటిది. గడ్డు కాలం నడుస్తున్నందున కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుంది. అయితే, మళ్లీ గాడిన పడాలంటే అతడు ఏదో ఒక ఫార్మాట్ (టి20)ను వదులుకోవడమే ఉత్తమం.

కపిల్ మాటే నిజమైతే..

''టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా కొనసాగుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ లాంటి మేటి బౌలర్‌నే పక్కన పెట్టినప్పుడు కోహ్లీ లాంటి ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టరు...? ఇప్పుడు టీ20 క్రికెట్‌లో కోహ్లీని కూడా తుది జట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టే పరిస్థితులు ఉన్నాయి. టెస్టుల్లో ప్రపంచ నంబర్‌ 2 వంటి బౌలర్‌ అయిన అశ్విన్‌నే పక్కన పెట్టినప్పుడు ఏదో ఒక సమయంలో ప్రపంచ నంబర్‌ 1 బ్యాట్స్‌మన్‌ను కూడా పక్కనపెడతారు. కోహ్లీ ఇన్నేళ్లుగా మనం చూసిన ఆటను ఇప్పుడు ఆడలేకపోతున్నాడు.

అతడు తన ఆటతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అతడు రాణించకపోతే.. బాగా ఆడే యువ ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. అయితే, జట్టులో ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండాలని నేను అనుకుంటాను. యువ క్రికెటర్లు బాగా ఆడి ఇలాంటి స్టార్‌ ఆటగాళ్లకు గట్టి సవాల్‌ విసరాలి'' ఇదీ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ వ్యాఖ్య. దీన్నిబట్టయినా కోహ్లికి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నట్లే.
Tags:    

Similar News