సెహ్వాగ్ కూడా గుడ్ బై చెప్పనున్నారా?

Update: 2015-10-19 17:43 GMT
ఒక్కసారి కనెక్ట్ అయ్యాడంటే బౌలర్ ఎవరైనా సరే.. పిచ్ లో ఇరగదీసేసి టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. భారత జట్టులో ఇప్పటివరకూ ట్రిఫుల్ సెంచరీ చేసిన ఏకైక మొనగాడు సెహ్వాగ్ మాత్రమే. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడినా ముఖంలో ఎలాంటి అలసట లేకుండా ఆడే సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నాడంటే.. స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే.

సింగిల్స్ తీసేందుకు పెద్దగా మక్కువ చూపని సెహ్వాగ్.. బంతిని ఎంతలా శిక్షిస్తారో బౌలర్లకు బాగానే తెలుసు. అలాంటి ఆయన గత కొద్దికాలంగా టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో.. తన రిటైర్మెంట్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్య కలకలాన్ని రేపుతోంది. రెండు రోజుల క్రితమే జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించి.. క్రికెట్ క్రీడాభిమానులు బాధలో ఉన్న సమయంలోనే సెహ్వాగ్ నోటి నుంచి రిటైర్మెంట్ మాట రావటం అభిమానుల ఆశనిపాతంగా మారింది.

ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న సెహ్వాగ్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగి మాస్టర్ చాంఫియన్స్ లీగ్ ట్వంటీ 20 సిరీస్ లో తాను ఆడనున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్ లో కేవలం రిటైర్ అయిన వారు మాత్రమే ఆడే నేపథ్యంలో సెహ్వాగ్ రిటైర్మెంట్ అనివార్యంగా మారింది. వాస్తవానికి సెహ్వాగ్ తన 37వ జన్మదినోత్సవాన్ని ఆదివారమే జరుపుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆయన వెటర్న్ ట్వంటీ 20 లీగ్ లాంఛింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా.. ఆయనకో ప్రశ్న ఎదురైంది. మరి.. ఈ సిరీస్ లో ఆడాలంటే రిటైర్ కావాలి కదా అని ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ నేను రిటైర్ కాకుంటే..నేను ఇందులో ఆడను. నేను భారత్ వెళ్లాక నా రిటైర్మెంట్ ప్రకటిస్తా’’ అని వ్యాఖ్యానించటంతో సెహ్వాగ్ రిటైర్మెంట్ పక్కా అని చెబుతున్నారు.

అయితే.. సెహ్వాగ్ రిటైర్మెంట్ ఇప్పటికిప్పుడు కాకపోవచ్చని.. హర్యానా రంజీతో ఆయనకున్న కమిట్ మెంట్ పూర్తి చేసుకున్నాకే గుడ్ బై చెప్పొచ్చని.. ఇందుకు మరికొద్ది నెలలు సమయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. మాస్టర్స్ చాంఫియన్ జరిగేది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కాబట్టి.. అప్పటికి రిటైర్ అయ్యేలా సెహ్వాగ్ ప్రకటన ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. చూస్తుంటే.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. సెహ్వాగ్ నోటి నుంచి మరో విస్పష్టమైన ప్రకటన వస్తే కానీ రిటైర్మెంట్ గురించి పక్కాగా చెప్పలేమని చెప్పొచ్చు.
Tags:    

Similar News