ఆస్ప‌త్రి నుంచి వైర‌స్ బాధితుడు అదృశ్యం.. 9 రోజుల త‌ర్వాత శ‌వంగా ప్ర‌త్య‌క్షం

Update: 2020-07-04 17:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీభ‌త్సం సృష్టిస్తోంది. భారీస్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి.. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. అయితే ఆస్ప‌త్రుల్లో వైర‌స్ బాధితులను స‌క్ర‌మంగా ప‌ట్టించుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లో ఓ వైర‌స్ బాధితుడి అదృశ్యం సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. అత‌డు అదృశ్య‌మై దాదాపు ప‌ది రోజులు చేర‌గా అత‌డి ఆచూకీ ల‌భించ‌లేదు. అయితే తాజాగా 9వ రోజు అత‌డు ఆస్ప‌త్రిలో మృత‌దేహంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. దీంతో ఒక్క‌సారిగా ఆస్ప‌త్రి ఉలిక్కిప‌డింది. వైర‌స్ బాధితుడు ఇన్నాళ్లు ఎక్క‌డ‌కు వెళ్లాడు? ఎవ‌రెవ‌రినీ క‌లిశారోన‌ని అధికారులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

విజ‌య‌వాడ‌లోని పాతబస్తీకి చెందిన వృద్ధుడు (62) ఆయాసంతో బాధపడుతుండడంతో అతడి భార్యతో క‌లిసి గ‌త‌నెల 23వ తేదీన విజయవాడలోని ప్రభుత్వ ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే అత‌డి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించ‌డంతో త‌ర్వాతి రోజు (24వ తేదీ)న‌ నక్కలరోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు అత‌డిని పరీక్షించి వైర‌స్ లక్షణాలు క‌నిపించ‌డంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లమని సూచించారు. దీంతో మళ్లీ ప్రభుత్వ ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్కడ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని ఓపీకి వెళ్లగా సిబ్బంది వృద్ధుడి పేరు రాసుకుని మిగతా వివరాలు న‌మోదుకు ఆధార్‌ కార్డు అడిగారు. అయితే ఆమె త‌న వెంట ఆధార్‌ కార్డు లేదని అత‌డి భార్య‌ వృద్ధురాలు చెప్పింది. సాయం చేసేవారెవరూ లేరని, తానే ఇంటికి వెళ్లి తీసుకురావాలని ఆమె ఓపీలో ఉన్న సిబ్బందికి తెలిపి ఇంటికి వెళ్లింది. దీంతో రోగిని చికిత్స కోసం ఆస్ప‌త్రి లోపలికి పంపించారు.

మ‌రుస‌టి రోజు ఆధార్‌ కార్డు ప‌ట్టుకుని ఆస్ప‌‌త్రికి వచ్చిన వృద్ధురాలు అక్కడి సిబ్బంది మీ భ‌ర్త క‌నిపించ‌డం లేద‌ని తెల‌ప‌డంతో ఆమె షాక్‌కు గుర‌య్యింది. ఆధార్‌ కార్డు ఇచ్చి తన భర్త ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడగ్గా, ఆ పేరుతో పేషెంట్‌ ఎవరూ లేరని సిబ్బంది చెప్పడంతో కంగుతింది. తానే తన భర్తను తీసుకొచ్చానని, తన కళ్ల ముందే ఆస్ప‌త్రి లోపలికి వెళ్లారని మొత్తుకుంది. అయినా ఆస్ప‌త్రి సిబ్బంది ఆమె గోడును పట్టించుకోలేదు. దీనికి ఆమె ఆస్ప‌త్రి అధికారుల వ‌ద్ద‌కు వెళ్లింది. అయితే వారు నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చింది. ఆస్ప‌త్రిలో ఉంటే వెతుక్కోవాలని, లేదంటే వెళ్లిపోయి ఉండొచ్చంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆస్ప‌త్రిలో ఉన్న త‌న భ‌ర్త క‌నిపించ‌కుండాపోవ‌డంపై అధికారులు, వైద్యులు, సిబ్బందిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. దీంతో ఆమె వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు స్పందించి ఆస్ప‌త్రికి వచ్చి అధికారులను అడిగినా వారికీ నిర్లక్ష్యపు స‌మాధానమే వ‌చ్చింది.

అయితే పోలీసులు ద‌ర్యాప్తు చేసి చివరకు వాస్త‌వాలు క‌నిపెట్టారు. ఈ విష‌య‌మై పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 24వ తేదీన ఆస్ప‌త్రి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని ఓపీ విభాగం నుంచి వృద్ధుడు ఆస్ప‌త్రి లోపలకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో పోలీసులకు ఆధారాలు లభించాయి. అతను ఒక్కడే కదల్లేని పరిస్థితిలో పడి ఉండడంతో ఆ రాత్రి డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది సెకండ్‌ ఫ్లోర్‌లోని ఐసీయూలోకి తీసుకెళ్లినట్లు, అక్కడి నుంచి మూడో ఫ్లోర్‌లోని ఐసీయూకు తీసుకెళ్లినట్లు, ఆరోజు అర్ధరాత్రే ఆ వృద్ధుడు మృతిచెందినట్లు మొత్తం సీసీ టీవీలో రికార్డ‌య్యింది. ఆ మృత‌దేహాన్ని వెంటనే మార్చురీకి తరలించారు.

అయితే ఇక్క‌డే అస‌లు క‌థ జ‌రిగింది. మార్చురీకి వెళ్లి మృత‌దేహం పరిశీలిస్తే అతడి మృతదేహాన్ని వేరే పేరుతో మార్చురీ రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో అత‌డు క‌నిపించ‌కుండాపోయాడ‌ని భార్య ఆందోళ‌న చెందింది. ఇది చూడ‌గానే ఊపిరి పీల్చుకుంది. ఓపీ విభాగానికి వచ్చిన వృద్ధుడు రెండు ఐసీయూల్లో ఇన్‌పేషెంట్‌గా ఉన్నప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు నమోదు చేయకపోవడం, చనిపోయాక కూడా అతడి‌ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వ‌లేదు. బాధ్యత లేకుండా వ్యవహరించడంతో వృద్ధుడు గుర్తుతెలియని శవంగా మారిపోయాడు.

ఈ ఘ‌ట‌న‌పై కృష్ణా ‌జిల్లా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌ స్పందించి దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ చేయాల‌ని‌ ఆ సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. విచారణ అధికారిగా విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్రను నియమించారు. వైర‌స్ బాధితుడిగా ఉన్న వృద్ధుడు తొమ్మిది రోజులపాటు ఆచూకీ క‌నిపించ‌కుండాపోయి శుక్రవారం అదే ఆస్ప‌త్రి మార్చురీలో గుర్తుతెలియని శవంగా దొరక‌డంతో పోలీసులు, ఆస్ప‌త్రి సిబ్బంది షాక్‌కు గుర‌య్యారు. ప్రభుత్వ ఆస్ప‌త్రి అధికారుల నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్తున్న రోగుల ప్రాణాలను అక్కడి వైద్యాధికారులు, వైద్యులు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో ఈ ఒక్క ఘటనతో తెలిసింది. వైర‌స్ బాధితులకు రూ.కోట్లు ఖర్చుచేసి ఏర్పాటుచేసిన ఐసీయూల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల్లోని డొల్లతనం బయటపడింది.




Tags:    

Similar News