వైజాగ్ ఎయిర్ పోర్ట్ అంతలా దూసుకెళుతోంది!

Update: 2016-10-08 06:04 GMT
ఏపీని అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లేలా చేయాలన్న ఏకైక లక్ష్యంతో పయనిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఏం చేయాలన్న నిధుల కొరత వెంటాడుతోంది. ఇలాంటి నిరాశపూరిత వాతావరణంలో.. అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన.. భవిష్యత్తుకు సంబంధించిన ఆశల్ని చూపిస్తుంటారు. రానున్న కొన్నేళ్లలో ఏపీ ఇరగదీసేస్తుందని.. జెట్ స్పీడ్ తో దూసుకెళుతుందన్న మాటలు చెబుతుంటారు. అయితే.. ఆయన మాటల్లో నిజం ఉందని.. సరిగ్గా ప్రయత్నించాలే కానీ.. ఏపీకి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని.. వాటిని సరిగా వినియోగించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందటం పెద్ద విషయం కాదన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఎక్కడి వరకో ఎందుకు.. వైజాగ్ ఎయిర్ పోర్ట్ సంగతే తీసుకుంటే.. విభజనకు ముందు.. అరొకొర విమానాలు మాత్రమే వచ్చి పోతుండేవి. కానీ.. విభజన నేపథ్యంలో ఏపీకి విమాన రాకపోకలు పెంచేందుకు వీలుగా.. ఉన్న ఎయిర్ పోర్టులపై ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించటం.. దీనికి తగ్గట్లే ఏపీ ప్రజలు తమకు అంది వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవటం మొదలైంది. గతంలో హైదరాబాద్ సెంట్రిక్ గా ఉండే ఆలోచనలకు భిన్నంగా సీమాంధ్రులు ఇప్పుడు విశాఖ.. విజయవాడ.. తిరుపతి కేంద్రంగా ఆలోచించటం మొదలు పెట్టారు.

ఈ వాదనకు బలం చేకూరే గణాంకాలు తాజాగా బయటకు వచ్చాయి. గతానికి భిన్నంగా.. విశాఖ ఎయిర్ పోర్ట్ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ఒక్క నెలలో అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణం చేయటం శుభ పరిణామంగా చెప్పాలి. విశాఖ నగరానికి గతంలోనే గుర్తింపు ఉన్నప్పటికీ.. పాలకుల నిర్లక్ష్యంతో జరగాల్సినంత అభివృద్ధి జరగకపోవటమే కాదు.. రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాని దుస్థితి. విభజన అనంతరం ఆ కొరతను తీర్చేలా పాలకులు వ్యవహరిస్తుండటంతో విశాఖకు మంచిరోజులు మొదలయ్యాయి.

ఇక.. రికార్డు విషయానికి వస్తే.. ఒక్క ఆగస్టు నెలలోనే  విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి రికార్డుస్థాయిలో ప్రయాణికులు ప్రయాణం చేయటం గమనార్హం. ఒక్క నెలలో 2,05,445 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. ఇందులో అంతర్జాతీయ ప్రయాణికులు 7,897 ఉంటే.. దేశీయంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసిన వారి సంఖ్య 1,97,548 ఉండటం విశేష. ఒక నెలలో రెండు లక్షల మంది విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణం చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత ఏడాది ఇదే సమయానికి విశాఖ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణించిన ప్రయాణికులతో పోలిస్తే.. ఈ ఆగస్టులో ప్రయాణించిన వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. విశాఖతో పాటు.. ఏపీలోని మిగిలిన విమానాశ్రయాలు విజయవాడ.. తిరుపతి..రాజమండ్రి నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్న గణాంకాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News