మంత్రులను చంపడానికి ప్రయత్నించారు: విశాఖ సీపీ ప్రెస్‌ నోట్‌లో ఏముంది?

Update: 2022-10-16 07:31 GMT
విశాఖపట్నంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ మంత్రుల కార్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు జనసేన నేతలను బాధ్యులను పోలీసులు పలువురు, నేతలను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ఒకే రోజు అటు అధికార వైస్సార్సీపీ .. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జనను నిర్వహించింది. మరోవైపు టీడీపీ.. సేవ్‌ ఉత్తరాంధ్ర పేరుతో చర్చావేదికను నిర్వహించింది. ఇక శనివారమే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ టూరుతో ప్రశాంత విశాఖ నగరం జన హోరుతో హోరెత్తింది.

ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలకడానికి భారీ ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో విశాఖ గర్జనను ముగించుకుని వైసీపీ మంత్రులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మంత్రుల కార్లపై చెప్పులు, చీపుర్లు విసిరారు.

ఇది జనసేన పార్టీ కార్యకర్తల పనేనని పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు.  

ఈ సందర్భంగా.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద అనుమతి లేకుండా 300 మంది వరకు జనసేన నేతలు గుమిగూడారని ప్రెస్‌ నోట్‌లో పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలను అగౌరపరిచే పదజాలంతో దూషించారని.. వారిని చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని పోలీస్‌ కమిషనర్‌ తన ప్రెస్‌ నోట్‌లో పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా ప్రజాశాంతికి భంగం కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని తెలిపారు. సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ రూల్స్‌ అతిక్రమించారని పేర్కొన్నారు.

అంతేకాకుండా జనసేన కార్యకర్తలు పెందుర్తి ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ ప్రెస్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మున్నంగి దిలీప్‌కుమార్, సిద్దు, సాయికిరణ్, హరీష్‌ లాంటి సామాన్య ప్రజలకు గాయాలయ్యాయని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. జనసేన కార్యకర్తల చర్యలతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణీకులు తమ విమాన ప్రయాణాన్ని కోల్పోయారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన జనసేన నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశామని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ప్రెస్‌ నోట్‌లో పేర్కొనడం గమనార్హం.

మరోవైపు, విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ఘటనలో అరెస్ట్‌ల పర్వం ప్రారంభమైంది. మంత్రులపై దాడి ఘటనలో పోలీసులు.. పలువురు జనసేన కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌ బస చేసిన నోవోటెల్‌ హోటల్‌లో తెల్లవారుజామున వందలాది పోలీసులు మకాం వేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు పవన్‌ కల్యాణ్‌ బస చేసిన రూమ్‌ వద్ద కూడా ఆయనతో పలువురు పోలీసు అధికారులు వాగ్వివాదానికి దిగారని జనసేన నేతలు చెబుతున్నారు. అక్కడే వంద మంది జనసేన నేతలను అరెస్టు చేశారు. పవన్‌ కల్యాణ్‌ రక్షణ కోసం నోవోటెల్‌ హోటల్‌కు తరలివచ్చిన పవన్‌ అభిమానులను లాఠీలతో పోలీసులు చితకబాదారు.
Tags:    

Similar News