విశాఖ ఉక్కు...లెక్క తేల్చేస్తున్నారు !

Update: 2023-01-01 15:07 GMT
విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కుగా ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే గర్వకారణంగా ఉంది. విశాఖ ఉక్కు ఉండబట్టే విశాఖ దివ్యంగా వెలిగిపోతోంది. విశాఖకు అనేక కేంద్ర పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు అనుబంధ పరిశ్రమలు రావడానికి విశాఖ ఉక్కు కారణం. అలాంటి విశాఖ ఉక్కుని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసే పనిని కేంద్రం చేస్తోంది అని అంటున్నారు.

విశాఖ ఉక్కులో కీలకమైన విభాగాలను చూస్తున్న ముఖ్య అధికారులు నిపుణులు, సిబ్బంది వరసబెట్టి పదవీ విరమణ చేస్తున్నారు. సగటున చూస్తే ప్రతీ నెల అరవై నుంచి డెబ్బై మంది దాకా విశాఖ  ఉక్కు కర్మాగారం నుంచి రిటైర్ అవుతారు. అయితే వారు పదవీ విరమణ చేసిన పోస్టులు మాత్రం భర్తీ కాకుండా అలాగే ఖాళీగా ఉంచేస్తున్నారు.

ఇలా 2019 నుంచి అంటే రెండవమారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక వ్యూహం ప్రకారం సాగుతోంది అని అంటున్నారు. దీని కనుక లెక్క వేసుకుంటే మూడేళ్ళకు గానూ రెండు వేల మంది దాకా వివిధ కీలక విభాగాలలో అధికారులు, సమర్ధులైన సిబ్బంది లేకుండా పోయారని అంటున్నారు. అలాగే నిపుణుల కొరత కూడా పట్టి పీడిస్తోంది అని చెబుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ లో వేరే వారికి ఈ పనులు సైతం అప్పగించి చేయిస్తునారు. అంతా ఇంచార్జుల మయంగానే కధ సాగుతోంది అని అంటున్నారు.

మరి కొత్తగా పోస్టులు నింపకుండా ఖాళీలు పెట్టి ఉంచడానికి కారణం ఏంటి అంటే ఎటూ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు కాబట్టి కొత్త కొలువులు అన్నవి లేవు అంటున్నారు. కొత్తగా తీసుకోవడం మళ్లీ వారితో కొత్త తలనొప్పులు ఎందుకు అని అలాగే చేస్తున్నారుట. దాంతో ఉన్న వారి మీద పని భారం పెరుగుతోంది. పనిలో నాణ్యత తగ్గుతోంది. అలాగే నిపుణులు కీలక ప్లేస్ లలో ఉండాల్సిన వారు లేకపొవడంతో సంస్థ అభివృద్ధికి అది భారీ లోటుగా ఉంది అని అంటున్నారు. అయినా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ విషయంలో పట్టనట్లుగానే ఉంది అంటున్నారు.

దీని మీద అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేయడానికే ఈ రకంగా చేస్తున్నారు అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దుర్విధానంగా  మండిపడుతున్నారు. ప్లాంట్ లో కీలకమైన విభాగాలకు అవసరమైన సామగ్రి ఉండదు. సొంత గనులు లేకుండా చేస్తున్నారు. మానవ వనరులను కూడా తగ్గించడం ద్వారా  స్టీల్ ప్లాంట్ ని బలహీనపరుస్తున్నారు అని విమర్శిస్తున్నారు.

ఇకపోతే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఈ ఏడాది చాలా కీలకం అని అంటున్నారు. ఈ ఏడాది స్టీల్ ప్లాంట్ జాతకం అటో ఇటో తేలిపోతుంది అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో దూకుడు చూపిస్తున్న కేంద్రం ఆ శుభవార్తను తొందరగా వినిపించాలని ఉత్సాహపడుతోంది అని అంటున్నారు. అయితే దాన్ని అడ్డుకోవడానికి ఉద్యోగ కార్మిక సంఘాలు మరింత రెట్టించిన శక్తితో ఉద్యమాలకు కొత్త ఏడాది కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. మరి స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో 2023 చెప్పనుంది అంటున్నారు.
Tags:    

Similar News