కేంద్ర మంత్రికి ‘ఉక్కు’ నిరసనల రుచి చూపించిన విశాఖ వాసులు

Update: 2021-08-07 03:58 GMT
లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తారా? అన్న ప్రశ్నను సంధిస్తే.. ఎవరైనా నోచెబుతారు. అలాంటిది తాను ఒకసారి డిసైడ్ అయితే చాలు.. ఏం చేసినా ఫర్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కారు.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు వీలుగా అమ్మకానికి పెట్టటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా పట్టించుకోని పరిస్థితి. ఎవరేం అనుకున్నా.. తాము అనుకున్నదే చేయాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రం.. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది.

మరోవైపు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై విశాఖ వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఆ మాటకు వస్తే.. ప్రాంతాలకు.. రాష్ట్రాలకు అతీతంగా రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించటాన్ని తప్పు పడుతున్నారు. మోడీ సర్కారు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గడిచిన కొద్ది నెలలుగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నా.. ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితి. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకంపై చేస్తున్న ఆందోళన సెగ కేంద్రానికి తగిలేలా  వ్యవహరించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న ఘటన చూస్తే.. ఇకపై ఆ విమర్శ చేయటానికి వీల్లేని విధంగా విశాఖ వాసులు రియాక్షన్ ఉందని చెప్పాలి. శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన తెలుగింటి కోడల్ కమ్ కేంద్ర ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ కు నిరసనల సెగ తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినతులు ఇవ్వాలని విశాఖ ఉక్కు పరిశ్రమ జేఏసీ పేర్కొంది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు వద్దకు వందల సంఖ్యలో నిరసన చేసేందుకు తరలి వస్తారన్న సమాచారం పోలీసులకు అందింది.

దీంతో.. వారు పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాల్ని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే లోపలకు అనుమతించేలా చర్యలు చేపట్టారు. చివరకు నిర్మలా సీతారామన్ పర్యటనకు మీడియా ప్రతినిధుల్ని అనుమతించే విషయంలోనూ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నో చెప్పేశారు. మరోవైపు.. కేంద్ర ఆర్థికమంత్రికి నిరసనల సెగ రుచి చూపించారు. పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు ఎయిర్ పోర్టుకు చేరుకొని.. నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్దం కాగా.. వారిని అనుమతించని పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అరెస్టులు చేశారు. విమానాశ్రయం మొత్తం భద్రతా సిబ్బందితో నింపేసిన తీరు చూస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జరుగుతున్న ఆందోళన ఎంతలా ఉందన్న విషయాన్ని కేంద్రమంత్రికి అర్థమయ్యేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News