ఏం చేశామో చెప్తాం..ఇక ప్ర‌తిప‌క్ష‌మే

Update: 2018-03-19 05:49 GMT
గ‌త‌వారం వ‌ర‌కు మిత్ర‌ప‌క్షపార్టీ ..అందులోనూ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్ప‌టికీ...త‌ప్పును త‌ప్పుగా... ఒప్పును ఒప్పుగా ఎత్తిచూపించ‌డంతో పాటుగా తమ పార్టీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎలాంటి భేష‌జాలు లేకుండా పాలక‌ప‌క్షాన్ని నిల‌దీసే బీజేపీ ఎమ్మెల్యే,  ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నాయ‌కుడు  విష్ణుకుమార్ రాజు...మ‌రోమారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీరును త‌ప్పుప‌ట్టారు. గ‌తంలో అమరావ‌తి భూసేక‌ర‌ణ - విశాఖ భూకుంభ‌కోణంపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసి టీడీపీ స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసిన విష్ణు తాజాగా తెలుగుదేశం పార్టీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ప‌నితీరును త‌ప్పుప‌ట్టారు.

టీడీపీతో తమ పార్టీ మిత్రపక్షంగా ఉన్నందునే ఇంత కాలం పాటు తాము ఏమీ అనలేదని బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ - ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు వివ‌రించారు. అయితే సంద‌ర్భానుసారం అవినీతిపై స్పందించామ‌న్నారు. విశాఖ‌ భూ కుంభకోణాలపై సిట్‌ ను కలిసి ఆధారాలను సమర్పించామ‌ని వెల్ల‌డించారు. రికార్డుల ట్యాంపరింగ్‌ - ఆక్రమణలు - కబ్జాలపై ఆయన సిట్‌కు ఫిర్యాదు చేశారు. ముదపాక భూములు - చిట్టివలసలో 41 ఎకరాలు - పాయకారావుపేట రాజవరంలో 144 ఎకరాలు - మాధవధారలోని 2 ఎకరాలకు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేశామ‌ని విష్ణుకుమార్ రాజు వివ‌రించారు. క‌బ్జాకు గురైన‌ భూముల విషయంలో ఎక్కువగా ట్యాంపరింగ్‌ అయింది ప్రైవేట్‌ భూములేనని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే ఒక‌రిపై ఆరోపణలు వ‌చ్చాయ‌ని అన్నారు. భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని, రికార్డులు తారుమారు చేసినవారిపై చర్యలు చేప‌ట్టాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో టీడీపీ నేత‌ల‌ అవినీతి పెరిగిపోయిందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇసుక మాఫియాను టీడీపీ పెంచిపోషిస్తోందని ఆయన మండిప‌డ్డారు. ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించనున్నట్టు ఆయన చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. ఏపీకి ఏమిచ్చామో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ప్రజల్ని ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలోనే టీడీపీ, వైసీపీ నోటీస్‌లు ఇచ్చాయన్నారు. విపక్షాలన్నీ ఏకమైనా తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు.
Tags:    

Similar News