ఆ మంత్రి చాలా ఎక్కువ చేస్తున్నారట

Update: 2015-07-27 09:44 GMT
    ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో  పురపాలక మంత్రి నారాయణపై ఒక్కొక్కరికి పీకల్దాకా కోపం ఉంది... చంద్రబాబు ఆయనకు అమిత ప్రాధాన్యం ఇస్తుండడం... ఆయన  కూడా అంతేస్థాయిలో టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నట్లుగా... మంత్రిగా ముఫ్ఫయ్యేళ్ల అనుభవం ఉన్నవాడిలా హడావుడి చేస్తుండడంతో అంతా ఆయనపై మండిపడుతున్నారు. చంద్రబాబు మెచ్చిన మనిషి కదా అయన్నేమైనా అంటే ఎట్నుంచి ఏమొస్తుందో అన్న సంశయంతో కోపాన్ని కడుపులోనే దాచుకున్నారు. అయితే... స్థల మహత్యమో ఏమో కానీ మొన్న పుష్కరాల సమయంలో రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులంతా నారాయణపై తమకున్న కోపాన్ని ప్రకటించేశారు. ఇప్పుడు.... మంత్రులు, టీడీపీ నాయకులే కాదు... మిత్రపక్షం బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నారాయణపై గరంగరమవుతున్నారు.

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ప్రజారోగ్యం గురించి పట్టదని మండిపడ్డారు. ఆ మంత్రి ఫోన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుందనీ.. పుష్కరాల ముగిసిన తర్వాతనైనా ఆయన కార్మికుల సమస్యలపై స్పందించలేరా? అని నిలదీశారు. విశాఖపట్నంలో ఆదివారం విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, కార్మికులతో చర్చలు జరపాలని కోరేందుకు అయిదు రోజులు పాటు ఆయన్ను కలుసుకునేందుకు ప్రయత్నించానన్నారు. ఆఖరుకు రాజమండ్రికి వెళ్లి గన్‌మన్‌లను బతిమాలుకుని మంత్రిని కలిశానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. శాసనసభా బిజెపిపక్ష నేతనైన తనకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళతానంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదంతా చూస్తుంటే నారాయణ వ్యవహారం శ్రుతి మించుతున్నట్లుగానే ఉంది... చంద్రబాబు ఇప్పటికైనా పరిస్థితి గమనించి మంత్రివర్గంలో, మిత్రపక్షాల మధ్య ఉన్న ఈ గ్యాప్ లను సరిచేసేలా చర్యలు తీసుకోకపోతే ఈ అసంతృప్తులు, ఆగ్రహజ్వాలలు మరిన్ని ఇబ్బందులకు దారితీసే ప్రమాదముంది.
Tags:    

Similar News