మోదీ కోర్టులో బాబు ముద్దాయేనా!

Update: 2017-07-02 04:35 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై కేంద్రానికి ఇప్ప‌టికే చాలా ఫిర్యాదులు వెళ్లాయి. ఆ ఫిర్యాదుల‌న్నీ విప‌క్ష పార్టీలు చేసిన‌వే. అధికారంలో ఉన్న నేత‌ల‌పై విప‌క్షంలోని నేత‌లు కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతున్న‌దే. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు ఫిర్యాదుల‌ను కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు గానీ, ఎన్డీఏ ర‌థ‌సార‌థి హోదాలో ఉన్న బీజేపీ గానీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే ఈ దఫా చంద్ర‌బాబుపై కేంద్రానికి వెళ్ల‌నున్న ఫిర్యాదును మాత్రం క‌ల‌మ‌నాథులు కాస్తంత గ‌ట్టిగానే ప‌రిశీలించే అవ‌కాశాలు మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే... స‌ద‌రు ఫిర్యాదును కేంద్రానికి మోసుకెళుతున్న‌ది వేరెవ‌రో కాదు... రాష్ట్రంలో బాబు పార్టీ టీడీపీతో జ‌ట్టుక‌ట్టి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే - ఆ పార్టీ కీల‌క నేత విష్ణుకుమార్ రాజేన‌ట‌.

బాబు స‌భా నాయ‌కుడిగా ఉన్న ఏపీ శాస‌నస‌భ‌లో బీజేపీ ప‌క్ష నేత‌గా ఉన్న విష్ణుకుమార్ రాజు... విశాఖ‌లో విచ్చ‌ల‌విడిగా సాగుతున్న భూదందాల‌ను వెలికి తీశారు. భూదందాల‌ను అడ్డుకోబోయిన త‌న‌కు కూడా బెదిరింపులు ఎదుర‌య్యాయ‌ని గ‌తంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ స‌ర్కారులో పెద్ద గుబులునే రేపిన సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. విశాఖ భూ కుంభ‌కోణాల‌పై చంద్ర‌బాబు స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయ‌డం వెనుక రాజు గారు కూడా ఓ కార‌ణమ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో ప‌లు మార్లు మీడియా ముందుకు వ‌స్తున్న రాజు... మొన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖలో ఇప్ప‌టిదాకా వెలుగులోకి వ‌చ్చిన భూదందాల‌న్నీ తాను వెలికి తీసిన‌వేన‌ని ఆయ‌న చెప్పారు. వీటిపై ప్ర‌భుత్వం నియ‌మించిన సిట్ ద‌ర్యాప్తుతో ఎలాంటి ఉప‌యోగం క‌నిపించే అవ‌కాశాలే లేవ‌ని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏమాత్రం ప్ర‌యోజ‌నం లేని రీతిలో బాబు స‌ర్కారు ఈ దందాల‌పై విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయ‌డం త‌నను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అదే స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న అంశాన్ని ప్ర‌స్తావించిన రాజు... విశాఖ‌లో ఇటీవ‌లి కాలంలో చోటుచేసుకున్న ఓ భూ కుంభ‌కోణానికి సంబంధించిన వివ‌రాల‌న్నీ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని ఆయ‌న పెద్ద బాంబునే పేల్చారు. అయితే బాబు స‌ర్కారు భూ దందాల‌పై అనుస‌రిస్తున్న వైఖ‌రి కార‌ణంగా ఆ వివ‌రాల‌ను ఏపీ ప్ర‌భుత్వానికి ఇచ్చేది లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. తాను టీడీపీ స‌ర్కారుకు ఆ వివ‌రాలు ఇస్తే... త‌న‌పై దాడి చేసేందుకు కూడా భూబ‌కాసూరులు వెనుకాడర‌ని, త‌న‌ను బాబు స‌ర్కారు కాపాడుతుంద‌న్న భ‌రోసా లేద‌ని తేల్చేశారు. అయితే ఈ దందాపై తాను సైలెంట్‌ గా మాత్రం ఉండేది లేద‌ని చెప్పిన రాజు... ఈ దందాకు సంబంధించిన మొత్తం వివ‌రాల‌ను నేరుగా న‌రేంద్ర మోదీ స‌ర్కారుకు పంపుతాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ దందా వివ‌రాల‌తో పాటుగా భూ కుంభ‌కోణాల‌పై బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కూడా ఫిర్యాదు చేస్తాన‌ని రాజు చెప్పుకొచ్చారు. ఇదే జ‌రిగితే... సొంత పార్టీ ఎమ్మెల్యే, అందునా... బాబు స‌భా నాయ‌కుడిగా ఉన్న ఏపీ అసెంబ్లీలో త‌మ పార్టీ నేత‌గా ఉన్న రాజు నుంచి అందే ఫిర్యాదును బీజేపీ అధిష్ఠానం గానీ, న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు గానీ అంత ఈజీగా ప‌రిగ‌ణించ‌బోద‌ని తెలుస్తోంది. అంటే... రాజు ఫిర్యాదు గ‌నుక కేంద్రానికి చేరితే... ఇప్ప‌టిదాకా కేంద్రం నుంచి చంద్ర‌బాబును ఎప్ప‌టిక‌ప్పుడు ర‌క్షిస్తూ వ‌స్తున్న బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు కూడా బాబును కాపాడ‌లేర‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News