బాబు ప‌థ‌కాల‌న్నీ... వేస్టేన‌ట‌!

Update: 2017-07-07 05:01 GMT
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు న‌వ్యాంధ్ర‌లో సాగిస్తున్న పాల‌న ఆయ‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ నేత‌ల‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేదు. మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ... టీడీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హార స‌ర‌ళిపై ఎప్ప‌టిక‌ప్పుడు నిప్పులు చెరుగుతూ ఉండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శనంగా చెప్పుకోవ‌చ్చు. బీజేపీ అధిష్ఠానంతో అత్యంత స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు... నిత్యం చంద్ర‌బాబు పాల‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విష్ణుకుమార్ రాజు తొలుత టీడీపీ స‌ర్కారుతో కాస్తంత అనుకూలంగానే క‌నిపించినా... తాజాగా విశాఖ‌లో వెలుగుచూసిన భూకుంభ‌కోణాల‌పై స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఆయ‌న త‌న వైఖ‌రిని మార్చేశారు. సోమూ వీర్రాజు లాగే టీడీపీ ప్ర‌భుత్వంపై విష్ణుకుమార్ రాజు నిత్యం విమ‌ర్శ‌లు సంధిస్తూనే ఉన్నారు. భూకుంభ‌కోణాల‌కు సంబంధించి చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై నేరుగా కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేస్తాన‌ని మొన్న ప్ర‌క‌టించిన రాజు... టీడీపీలో పెను క‌ల‌క‌ల‌మే రేపారు.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే... ఏపీలో మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని, ఇందుకు స్వ‌యంగా ప్ర‌భుత్వ‌మే మ‌ద్ద‌తు ప‌లుకుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన కొత్త మ‌ద్యం పాల‌సీని ఆస‌రా చేసుకుని జ‌నావాసాల్లో వైన్ షాపులు, బార్ల‌ను తెరిచేందుకు య‌త్నించిన మ‌ద్యం వ్యాపారుల‌కు ఎక్క‌డికక్క‌డ నిర‌స‌న‌లు స్వాగ‌తం ప‌లికాయి. వెర‌సి రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మ‌ద్యం వ్యాపారుల‌కు చుక్క‌లు క‌నిపించ‌గా, వారంతా త‌ప్పంతా ప్ర‌భుత్వానిదేన‌న్న‌ట్లుగా బాబు స‌ర్కారుపై ఆగ్ర‌హోద‌గ్రుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన రాజు... ఏపీలో మ‌ద్యం వ్యాపారం ఏ స్థాయిలో జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని చెబుతూ... చంద్ర‌బాబు స‌ర్కారుపై భారీ సెటైర్లే వేశారు. ప్ర‌స్తుతం ఏపీలో మ‌ద్యం వ్యాపారం మూడే బార్లు, ఆరు వైన్స్ షాపులుగా కొన‌సాగుతోంద‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జనావాసాల మధ్య మద్యం షాపులకు అనుమతివ్వడం కంటే నీచమైన పని మరోటి లేదంటూ ఆయన మండిపడ్డారు.

మంత్రి ఇంటి పక్కనే మద్యం షాపు పెడితే లైసెన్స్ ఇస్తారా? అని ఆయన బాబు స‌ర్కారును సూటిగా  ప్రశ్నించారు. ఏపీలో నూతన మ‌ద్యం పాల‌సీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, మ‌ద్యం విక్ర‌యాల‌కు సంబంధించి డబ్బే కాదు... .ప్రజా శ్రేయస్సూ ముఖ్యమనే విషయాన్ని తెలుసుకోవాలని బాబు అండ్ కోకు త‌లంటేశారు. ఏపీలో బీజేపీ ప్రభుత్వం వస్తే మద్యం విక్రయాలు అనేవే ఉండవంటూ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకలతో ప్ర‌జ‌ల‌కు ఒరిగేదీ లేద‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. ఈ ప‌థ‌కాల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ప‌థ‌కాల‌ను నిలిపివేసి, ఆ డబ్బును ఆసుపత్రులకు వినియోగిస్తే పేదోడికి మేలు జరుగుతుందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. మ‌రి రాజుగారి కామెంట్ల‌పై బాబు అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News