బాబు పాల‌సీ... బూతు పాల‌సీనేన‌ట‌!

Update: 2017-07-20 05:22 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఏదుర్కొంటోంది. జాతీయ ర‌హదారుల‌పై మ‌ద్యం విక్ర‌యాలు వ‌ద్దంటూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు, అదే స‌మ‌యంలో న‌వ్యాంధ్ర‌లో అప్ప‌టిదాకా కొన‌సాగిన మ‌ద్యం పాల‌సీ స్థానంలో బాబు స‌ర్కారు కొత్త పాల‌సీ తీసుకుని రావ‌డం, కొత్త లైసెన్సుల‌ను ద‌క్కించుకున్న వారు హైవేల‌కు దూరంగా జ‌నావాసాల్లో మ‌ద్యం షాపుల ఏర్పాటుకు య‌త్నించ‌డం, మ‌హిళా లోకం ఒంటికాలిపై లేవ‌డం... త‌దిత‌ర ప‌రిణామాల‌న్నీ కూడా ఇప్పుడు ఏపీలో బాబు స‌ర్కారును తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేశాయ‌నే చెప్పాలి.

మ‌రోవైపు మొన్న‌టికి మొన్న విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానికి కూత‌వేటు దూరంలో జ‌రిగిన త‌న పార్టీ ప్లీన‌రీలో మ‌ద్యం వ్యాపారంపై ద‌శ‌ల‌వారీ నిషేధం విధిస్తాన‌ని విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్ నుంచి ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న వెలువడ‌టం, మ‌ద్య నిషేధంపై తాము కూడా ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేయ‌కుంటే పుట్టి మున‌గ‌డం ఖాయ‌మేన‌న్న భ‌యంలో బాబు స‌ర్కారు కాస్తంత కంగారు ప‌డిపోయింద‌న్న వాద‌న వినిపించింది. ఈ క్ర‌మంలోనే ఉన్న‌ప‌ళంగా బెల్లు షాపుల‌ను స‌మూలంగా నిర్మించాల‌న్న నిర్ణ‌యాన్ని బాబు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని విప‌క్షంతో పాటు మిత్ర‌ప‌క్షం కూడా తూల‌నాడేసిన వైనం ఇప్పుడు రాష్ట్రంలో స‌ర్వ‌త్రా చర్చ‌నీయాంశంగా మారింద‌నే చెప్పాలి.

బాబు స‌ర్కారు నిర్ణ‌యంపై అంద‌రికంటే ముందుగా స్పందించిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా... బాబును ఏకంగా ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్స్‌గా అభివ‌ర్ణించారు. ఇక తాజాగా టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన కీల‌క నేత‌ - ఏపీ శాస‌న‌స‌భ‌లో ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు వంతు వ‌చ్చేసింది. నిన్న చంద్ర‌బాబు పాల‌నా యంత్రానికి కేంద్రంగా ఉన్న వెల‌గ‌పూడి స‌చివాల‌యానికి వ‌చ్చిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన రాజు... బాబు స‌ర్కారు అమ‌లు చేస్తున్న మ‌ద్యం పాల‌సీపై విప‌క్షం కంటే కూడా విప‌రీత‌మైన భాష‌తో విరుచుకుప‌డ్డారు. బాబు స‌ర్కారు అమ‌లు చేస్తున్న మ‌ద్యం పాల‌సీని ఆయ‌న ఏకంగా బూతు పాల‌సీ అంటూ సంబోధించారు. బాబు పాల‌సీ పెద్ద బూతు పాల‌సీ అంటూ మొద‌లెట్టిన రాజు గారు... గుక్క తిప్పుకోకుండా చెడామ‌డా తిట్టేశారు.

స‌చివాల‌యం సాక్షిగా రాజు గారు ఏమ‌న్నారంటే...  *ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం పాలసీ పెద్ద బూతు పాలసీ - ప్రజాకంటక పాలసీ. ఈ విధానం ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టుషాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం దారుణం - బెల్టుషాపులు తొలగిస్తామని సీఎం చెబుతున్నాడంటే ఇప్పటికి ఉన్నట్టే కదా? దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు - ప్రభుత్వ స్కూళ్లకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపులు ఉండకూడదు - అదే ప్రైవేటు గుళ్లు - ప్రైవేటు స్కూళ్ల దగ్గర అయితే మద్యం షాపులు పెట్టుకోవచ్చా? అంటే ఆ స్కూళ్లకు - ఆ గుళ్లకు వెళ్లే వాళ్లు మనుషులు కాదా? ఇళ్ల మధ్యలోనే షాపులుండటం వల్ల తాగుబోతులతో మహిళలు నానా మాటలు పడాల్సి వస్తోంది. చిన్నారులు కూడా జుగుప్సాకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మీరు అంతగా మద్యం తాగించాలనుకుంటే ఏ సూపర్‌ మార్కెట్లలాగానో ఊరిబయట ఓ కాంప్లెక్సు కట్టించుకుని అక్కడ అమ్ముకోవాలిగానీ... ఇళ్ల మధ్యలో, గుళ్ల మధ్యలో మద్యం అమ్ముతూ మహిళల మాన ప్రాణ రక్షణకు విలువ లేకుండా చేస్తున్నారు* అని రాజు ఏక‌బిగిన బాబు స‌ర్కారును క‌డిగిపారేశారు.

అస‌లు బెల్టు షాపులు లేవంటు గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన చంద్ర‌బాబు స‌ర్కారు... ఇప్పుడు బెల్టు షాపుల‌పై దాడులు నిర్వ‌హించి వాటిని ర‌ద్దు చేసేలా చ‌ర్య‌లు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిందంటే... రాష్ట్రంలో బెల్టు షాపులు కొన‌సాగుతున్న ప‌చ్చి నిజాన్ని బాబు స‌ర్కారు అంగీక‌రించేసింద‌ని కూడా రాజు ఆరోపించారు. అంటే రాష్ట్రంలో బెల్టు షాపుల తతంగం విష‌యంలో బాబును రాజు గారు అడ్డంగా బుక్ చేసేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News