వివేక్ కు నో ఎంట్రీ...హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీనే

Update: 2019-09-21 17:20 GMT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కార్యవర్గ ఎన్నికల్లో శనివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా హెచ్ సీఏపై మంచి పట్టు కొనసాగిస్తూ వస్తున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి... ఈ దఫా ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెచ్ సీఏ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియలోనే వివేక్ కు ఎదురు దెబ్బ తగిలింది. హెచ్ సీఏకు అధ్యక్షుడిగా చాలా కాలం పాటు కొనసాగిన ఆయన నామినేషన్ ను ఇప్పుడు ఏకంగా తిరస్కరించేశారు. దీంతో ఎప్పటినుంచో హెచ్ సీఏ పీఠం కోసం కాసుకుని కూర్చున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్... తన కలను నెరవేర్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన వెంకటస్వామి కుమారుడిగా వివేక్ కు కూడా మంచి పేరే దక్కింది. తండ్రి పలుమార్లు ఎంపీగా గెలిచిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఓ దఫా ఎంపీగా గెలిచిన వివేక్.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ప్రభుత్వ సలహాదారు పదవిని దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం ఒకింత దిలాసాగానే గడిపిన వివేక్... టీఆర్ ఎస్ లో ఇమడలేకపోయారు. దీంతో ఇటీవలే ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. రాజకీయ జీవితం ఇలా ఉంటే... కాంగ్రెస్ లో ఉన్నంత కాలం హెచ్ సీఏలోనూ వివేక్ మాట బాగానే చెల్లింది. టీమిండియా మాజీ కెప్టెన్ హోదాలో హెచ్ సీఏ పదవి కోసం వచ్చిన అజారుద్దీన్ నే వివేక్ పరారయ్యేలా చేశారు.

అయితే ఇప్పుడు వివేక్ కు అంతా వ్యతిరేకంగానే జరుగుతోంది. తాను తీసుకున్న నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారగా... దానితో పాటు ఇప్పుడు హెచ్ సీఏలోనూ ఆయన శకం ముగిసిపోయిందన్న వాదన కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. హెచ్.సీ.ఏ ఎన్నికల్లో వివేక్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయగా, ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి అక్రమాలపై హైకోర్టులో కేసు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదని అధికారులు తేల్చేశారు. హెచ్ సీఏలో 5 పదవులకు మొత్తం 72 నామినేషన్లు రాగా, 9 మంది వివిధ కారణాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి హెచ్ సీఏ ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కూడా ఉన్నారు. వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఈసారి అజార్ హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.


Tags:    

Similar News