రాబోయే రోజుల్లో విశాఖ జిల్లా ఎన్ని ముక్కలంటే?

Update: 2020-07-17 11:10 GMT
ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల మీద విపరీతమైన చర్చ నడుస్తోంది. దీనికి తగ్గట్లే తాను హామీ ఇచ్చినట్లుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన అధ్యయన నివేదికను ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాటతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మిగిలిన జిల్లాలకు భిన్నమైన పరిస్థితి విశాఖలో ఉంది. ఎన్నికలకు ముందు.. తాను ముఖ్యమంత్రిని అయితే ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్లే కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు షురూ చేశారు.

ప్రస్తుతం ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే.. మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన మరో 12 జిల్లాలు మాత్రమే కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. రెండు గిరిజన జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నది జగన్ ఆలోచన. ఇందులో భాగంగా విశాఖను నాలుగు జిల్లాలుగా మార్చాలన్నది ఆయన ఆలోచన. దీనికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖ జిల్లా జనాభా 42.9 లక్షలు. తాజా అంచనాల ప్రకారం 50 లక్షలకు దగ్గరకు రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగు రెవెన్యూ డివిజన్లు.. 46 మండలాలు ఉన్నాయి.

ప్రస్తుత విశాఖ జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి. విశాఖ.. అరకు.. అనకాపల్లి. ఈ మూడు లోక్ సభ స్థానాల పరిధిలో జిల్లాకు ఏ మాత్రం సంబంధం లేని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు పూర్తి భిన్నం విశాఖ జిల్లా. ఏపీలో నగర హోదా అంటే తొలుత వచ్చేది విశాఖపట్నమే.ఆ తర్వాతే విజయవాడ అయినా.. గుంటూరు అయినా. నగరం.. మైదానం.. ఏజెన్సీలతో కూడిన జిల్లాలో జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.

జిల్లా చివర్లో ఉన్న సీలేరు నుంచి విశాఖపట్నానికి రావాలంటే కనీసం రోజు పట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో పాలనా సౌలభ్యంతో పాటు.. చిన్న జిల్లాల్ని చేయటం ద్వారా మరింత డెవలప్ చేయాలన్నది రాష్ట్ర సర్కారు ఆలోచన. లోక్ సభ నియోజకవర్గాల వారీగా చూస్తే.. విశాఖలో గాజువాక.. విశాఖ పశ్చిమ.. దక్షిణ.. ఉత్తర.. తూర్పు.. భీమిలి.. ఎస్.కోట సెగ్మెంట్లు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలతో ఇబ్బంది లేదు కానీ.. ఎస్ కోట ఒక్కటి మాత్రం విజయనగరానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి విశాఖకు రావాలంటే విజయనగరం మీదుగా రావాలి. ఈ నేపథ్యంలో ఎస్.కోటను విజయనగరం జిల్లాలో ఉంచే వీలుందంటున్నారు.

కొత్తగా ఏర్పాటు చేసే అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ లోక్ సభా నియోజకవర్గ పరిధిలో పెందుర్తి.. అనకాపల్లి.. ఎలమంచిలి..పాయకరావుపేట.. నర్సీపట్నం.. చోడవరం.. మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పెందుర్తి.. సుజాతనగర్.. వేపగుంట.. లాంటి ప్రాంతాలు విశాఖ నియోజకవర్గానికి దగ్గర్లో ఉంటాయి. అందువల్ల వీటిని అనకాపల్లి కంటే విశాఖ జిల్లాలో చేర్చే అవకాశం ఉందంటున్నారు.

అరకు నియోజకవర్గాన్ని చూస్తే.. భౌగోళికంగా ఎంతో భిన్నం. అరకు లోక్ సభ స్థానాన్ని జిల్లాగా మార్చటానికి వీల్లేదు. ఎందుకంటే.. ఏజెన్సీ ప్రాంతం తూర్పుగోదావరి.. విశాఖ.. విజయనగరం..శ్రీకాకుళం జిల్లాల వరకు విస్తరించింది. అరకు లోక్ సభలోని రంపచోడవరం.. పాలకొండ.. పార్వతీపురం.. కురుపాం ప్రజలు అరకుకు రావాలంటే కనీసం మూడు.. నాలుగు బస్సులు మారాల్సి ఉంటుంది. అందువల్ల విశాఖలోని పాడేరు.. అరకు సిగ్మెంట్ ను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. అదే సమయంలోమాడుగుల.. ఎస్ కోట గిరిజన ప్రాంతాల్ని కలిపి మరో జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు.
Tags:    

Similar News