స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్... ఇపుడు గుర్తుకు వస్తున్నాయా...?

Update: 2023-06-12 23:01 GMT
బీజేపీ నిన్నటి దాకా మిత్రుడు అయింది. ఇపుడు ప్రత్యర్ధి అయింది. ఏపీ సీఎం జగన్ అయితే మాకు బీజేపీ అండ కూడా లేదు అని చెప్పేశారు. అలా కుండబద్ధలు కొట్టేశారు. ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీలు వేసిన జగన్ కి బీజేపీ పోకడలు తెలియకుండా ఉంటాయా అన్నదే ఇక్కడ మ్యాటర్.

ఏపీకి వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా ఔట్ రేట్ గా వైసీపీని టార్గెట్ చేశారు. ఏపీలో అవినీతి అక్రమ ప్రభుత్వం ఉందని అన్నారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి వైసీపీ కూడా తనదైన శైలిలో రియాక్ట్ అవుతోంది. అయితే జేపీ నడ్డా కామెంట్స్ ని మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా ఖండించారు.

కానీ అమిత్ షా చేసిన కామెంట్స్ కి ఆ రేంజిలో ఖండన అయితే కనిపించలేదు. జగన్ అయితే బీజేపీ అండ లేదు అంటూ ఒక్క మాట చెప్పి వదిలేసారు. నిజానికి బీజేపీలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారే నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈ ఇద్దరినీ విమర్శించాలంటే చాలా ఆలోచించాలని అంటారు.

ఇక్కడే సరిగ్గా 2018 నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. ఆనాడు చంద్రబాబు డేరింగ్ గా దేశమంతా తిరిగి బీజేపీని ఎండగట్టారు. మోడీ అమిత్ షాల మీద డైరెక్ట్ గా మాటలతో అటాక్ చేశారు. దానికి అంతకు అంత అన్నట్లుగా బీజేపీ కూడా బాబుని ఎన్నికల వేళ అష్ట దిగ్బంధనం చేసింది. ఫలితం చూస్తే టీడీపీ అధినేత అనుభవించారు అనే అంటారు.

ఇపుడు వైసీపీకి కళ్ల ముందు ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదే టైం లో బీజేపీ చూపించింది జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ముందు ముందు మరిన్ని మీటింగ్స్ ఏపీలో పెడతారు అంటున్నారు. ఇంకా పెద్ద ఎత్తున జాతీయ నేతలు ఫీల్డ్ లోకి వచ్చి  పెద్ద   గొంతు చేసుకుంటారు అని అంటున్నారు. మరి అపుడు కూడా ఇదే తీరుగా సన్నసన్నగా కామెంట్స్ చేసి కౌంటర్లు ఇస్తే వైసీపీకి సరిపోతుందా అన్న చర్చ వస్తోంది.

అయితే ఉన్నంతలో బీజేపీని అమిత్ షాని మంత్రి గుడివాడ అమరనాధ్, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు కౌంటర్ చేశారు. అమిత్ షా చుట్టూ చేరిన వారు అంతా టీడీపీ వారేనని, అందువల్లనే మోడీ అలా మాట్లాడారని అంటున్నారు. కానీ అమిత్ షా అంతటి అమాయకుడా అన్న చర్చ వస్తోంది.

ఆయన ఏమీ తెలియకుండా ఏపీకి వచ్చారా ఒక అజెండా పెట్టుకుని ఆయన ఏపీకి వచ్చి అతి పెద్ద పబ్లిక్ మీటింగులో మాట్లాడుతూ చేసిన సీరియస్ కామెంట్స్ వెనక నాలుగేళ్ల క్రితం ఆ పార్టీలో చేరిన టీడీపీ మాజీ తమ్ముళ్ళు ఉన్నారని వైసీపీ లైట్ తీసుకుంటోందా లేక అలా తీసుకోమని చెబుతోందా అన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు.

బహుశా మరిన్ని సభల తరువాత వైసీపీకి క్లారిటీ వచ్చేలా బీజేపీ పెద్దలే చేస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ ఇలా వైసీపీని కామెంట్స్ చేయగానే అలా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రైల్వే జోన్ వంటివి గుర్తుకు వచ్చాయని సెటైర్లు పడుతున్నారు. ఇప్పటిదాకా పెద్దగా వైసీపీ నేతలు ఎవరూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి టచ్ చేసింది లేదు.

అలాగే రైల్వే జోన్ ఏ పరిస్థితిలో ఉందో కూడా పెద్దగా తలచినది లేదు. కానీ అమిత్ షా ఇలా బిగ్ సౌండ్ చేస్తూ విమర్శలు వైసీపీ మీద దట్టించగానే ప్రత్యేక హోదా విభజన హామీల తో పాటు విశాఖ ఉక్కు రైల్వే జోన్ అన్నీ  వైసీపీ నేతల నోటి వెంట వస్తున్నాయని అంటున్నారు.

దీన్నే జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. బీజేపీతో దోస్తీ చెడిపోగానే ఏపీ హక్కులు బాధ్యతలు గుర్తుకు వస్తున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే గొంతు కొన్నాళ్ళ క్రితమే గట్టిగా బయటపెట్టి ఉంటే కనుక కచ్చితంగా విశాఖ ఉక్కుకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటున్నారు.

నాడు టీడీపీని అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కిన బీజేపీ ఇపుడు వైసీపీని అడ్డుపెట్టుకుని స్టీల్ ప్లాంట్ కే వేటు వేసే దాకా వచ్చిందని, కానీ ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు బీజేపీ తో వైరం పెరిగితేనే తప్ప తత్వం బోధపడదని అంటున్నారు.

ఆనాడు చంద్రబాబు ప్రత్యేక హోదా అంటూ ధర్మ పోరాట దీక్షలు చేస్తే ఇపుడు వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ సంగతేంటి అని అడుగుతున్నారు. కానీ బీజేపీ సక్సెస్ ఫుల్ గా ఏపీలోని ప్రాంతీయ పార్టీల రాజకీయ బలహీనతలను ఆసరాగా చేసుకుని తాను అనుకున్నది చేస్తూ పోతోంది అని అంటున్నారు.

Similar News