మోడీ కోసం : నభూతో నభవిష్యత్ అన్నట్లుగా !
నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఈ నెల 8న సాయంత్రం నాలుగు పదిహేను నిముషాలకు విశాఖలోని నేవీలోని ఐఎన్ఎస్ డేగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ. విశేష ప్రజాకర్షణ కలిగిన విఖ్యాత నాయకుడు విశాఖ వస్తున్నారు అంటే ఆ హడావుడే వేరే రేంజిలో ఉండాల్సిందే. పైగా హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ వస్తూండడం అదనపు ఆకర్షణ. మోడీ విశాఖ వచ్చి కూడా రెండున్నరేళ్ళు దాటుతోంది.
అప్పట్లో జగన్ సీఎం గా ఉన్నపుడు 2022 నవంబర్ లో మోడీ విశాఖకు ప్రధానిగా వచ్చారు. ఇపుడు ఏపీలోని ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. దాంతో ఈసారి మోడీ వస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఏర్పాట్లు చేస్తోంది.
విశాఖలో మోడీ ఉండేది కేవలం మూడు గంటలు మాత్రమే. అయితే మోడీ పర్యటన కోసం ఏకంగా ఏడు వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఏపీలోని మంత్రులు అంతా విశాఖలో విడిది చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు విశాఖకు వచ్చి మరీ అన్నీ పర్యవేక్షిస్తున్నారు.
నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఈ నెల 8న సాయంత్రం నాలుగు పదిహేను నిముషాలకు విశాఖలోని నేవీలోని ఐఎన్ఎస్ డేగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన విశాఖ సిరిపురానికి వచ్చేసరికి 4.45 సమయం పడుతుంది. అక్కడ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి మోడీ భారీ రోడ్ షోగా చేరుకుంటారు.
ఈ రోడ్ షో ముప్పావు గంట పాటు సాగుతుంది అని అంటున్నారు. ఈ రోడ్ షోలో మోడీ ఓపెన్ టాప్ వాహనం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్ టాప్ వాహనంలో పక్కన ఉండి రోడ్ షోలో కనిపిస్తారు. వేలాది మంది రోడ్ షోలో పాల్గొనేలా కూటమి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మోడీ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉండేది గంట పాటు అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 90 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమలను వర్చువల్ గా సభా వేదిక నుంచి ప్రారంభిస్తారు. అనంతరం సభా వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేస్తారు. చివరిగా నరేంద్ర మోడీ ఇరవై అయిదు నిముషాల నుంచి అరగంట పాటు మాట్లాడుదారు. ఆరున్నరకు సభ మొత్తం ముగుస్తుంది. మోడీ రాత్రి ఏడు గంటలకు ఐఎన్ఎస్ డేగా ఎయిర్ పోర్టుకు చేరుకుని అటు నుంచి నేరుగా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్తారు
ఇదిలా ఉంటే మోడీ సభకు రెండు లక్షల మంది జనాలను తీసుకుని రావాలని కూటమి నేతలు పట్టుదలగా ఉంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యాభై వేల మంది దాకా అదే ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ సభకు హాజరు అయ్యారు. దానిని మించేలా చరిత్రలో నిలిచిపోయేలా మోడీ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూటమి పెద్దలు నిర్ణయించారు.
మోడీ ప్రధానిగా తొలిసారి వస్తున్న వేళ ఆయనను పూర్తి స్థాయిలో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. మోడీ సభని అంతా మాట్లాడుకునేలా హైలెట్ చేయాలని చూస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ఈ సభలో ఏమి చెబుతారు అన్నదే అందరికీ ఆసక్తిగా ఉంది. ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ప్రైవేటీకరణ ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ గా సభ అయింది అని అంతా అనుకుంటారు.
అదే సమయంలో మోడీ విశాఖతో పాటు ఏపీకి కూడా వరాలు ఇస్తే ఆయన సభను విజయవంతం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటున్నారు. మరి మోడీ సభలో ఏమి మాట్లాడుతారు, ఏపీకి ఏ విధంగా తనదైన సాయం చేస్తారు అన్నదే అంతటా చర్చ అయితే సాగుతోంది.