విశాఖ ఉక్కు - మోడీకి రివర్స్ షాక్

Update: 2021-04-02 05:00 GMT
మంచి పనితీరును కనబరుస్తున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఎందుకు ప్రైవేటీకరణ చేస్తోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. తాజాగా సంస్ధ సీఎండి పీకే రథ్ చెప్పిన లెక్కల ప్రకారం చూసినా సంస్ద ఆర్ధిక పరిస్ధితి ఆరోగ్యంగా ఉంది. గడచిన నాలుగు నెలల్లో ఉక్కు స్టీల్స్ రూ. 740 కోట్ల నికర లాభాన్ని సంపాదించినట్లు చెప్పారు. అలాగే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ. 18 వేల కోట్ల అమ్మకాల టర్నోవర్ తో అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు స్వయంగా సీఎండీనే చెప్పటం గమనార్హం.

ఈ ఏడాది అమ్మకాలు 13 శాతం వృద్ధిరేటుతో 4.45 మిలియన్ టన్నుల అమ్మకాలు చేసిందట. ఒక్క మార్చినెలలో మాత్రమే 7,11 లక్షల టన్నుల అమ్మకాలతో రూ. 3300 కోట్లు రాబట్టినట్లు రథ్ చెప్పారు. మార్చి నెలలో అమ్మకాలు సంస్ధ చరిత్రలోనే ఇదొక రికార్డుగా సీఎండీ వివరించారు. గత ఏడాది ఇదే నెలలో సాధించిన అమ్మకాలు రూ. 2329 కోట్లు మాత్రమే అని తేడా కూడా చెప్పారు.

పైగా ఉత్పత్తి, అమ్మకాలు, లాభాలతో సంబంధం లేకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్ప్ బులిటి (సీఎస్ఆర్) క్రింద రూ. 10 కోట్లు, అలాగే పీఎం కేర్స్ కు రు. 5 కోట్లు చెల్లించినట్లు కూడా వెల్లడించారు.  మొత్తానికి సీఎండీ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే సంస్ధను ప్రైవేటీకరించాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే సంస్ధ ఆర్ధిక పరిస్ధితి చాలా ఆరోగ్యంగా ఉందని అర్ధమైపోతోంది.

మార్కెట్లో ఇతర సంస్ధల నుండి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని కూడా ఉత్పత్తి, అమ్మకాల్లో మంచి ఫలితాలనే రాబట్టినట్లు అర్ధమైపోతోంది. ఇదేగనుక సంస్దకు సొంతంగా ఇనుపఖనిజాన్ని కేంద్రప్రభుత్వం గనుక కేటాయించినట్లయితే మరింత మెరుగైన పనితీరునే చూపిస్తుందనటంలో సందేహంలేదు. సంస్ద చేస్తున్న వ్యయంలో ఎక్కువభాగం ముడిఇనుమును కొనటానికే ఖర్చు పెడుతోంది.  దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోవటమే కాకుండా లాభాలు కూడా తగ్గిపోతోంది.

అంటే సమస్యంతా సంస్ధ నిర్వహణలో లేదని కేంద్రప్రభుత్వ వైఖరిలోనే ఉందని అర్ధమవుతోంది. ఇనుపఖనిజాల కేటాయింపు కోసం సంస్ధ దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ప్రైవేటు సంస్ధలకు మాత్రం అడిగింది అడిగినట్లు ఇనుక ఖనిజాలను కేటాయిస్తున్నకేంద్రం ప్రభుత్వసంస్ధ అయిన విశాఖ స్టీల్స్ కు మాత్రం ఎందుకు కేటాయించటం లేదో ఎవరికీ అర్ధం కావటంలేదు.
Tags:    

Similar News