ఆ అంటే అమరావతి.. ఉ అంటే ఉక్కు... ?

Update: 2021-11-03 15:30 GMT
అ అంటే అమ్మ. ఉ అంటే ఊయల‌.. ఒకటవ తరగతి తెలుగు పాఠం ఇపుడు ఎందుకు అంటే ఏపీ రాజకీయాలకు మాత్రం చాలా అవసరం అంటున్నాయి పరిస్థితులు.  ఆ అంటే అమరావతి.. ఉ అంటే ఉక్కు అనేలాగానే పొలిటికల్ సీన్ ఏపీలో ఉంది. అమరావ‌తి రాజధాని ఉద్యమం రెండేళ్లుగా తగ్గేదిలే అన్నట్లుగానే రాజుకుంటూ ఈ రోజు మహా పాదయాత్ర దాకా సాగుతోంది. ఇక తొమ్మిది నెలలుగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద ఉద్యమం సాగుతోంది. మూడు రాజధానుల పేరిట జగన్ 2019 శీతాకాలంలో శాసనసభలో చేసిన ప్రకటన అమరావతిలో చిచ్చు రేపింది. నాటి అర్ధరాత్రి నుంచి రైతులు పోరాట బాట పట్టారు. వారు అలుపెరగకుండా ఈ రోజుకూ కదం తొక్కుతున్నారు. వైసీపీ సర్కార్ వ్యూహమో, వ్యూహాత్మక తప్పిదమో తెలియదు కానీ మూడు రాజధానులు మాత్రం అమరావతి రాజధానిలో  చిచ్చు రేపింది. అది ఆరని మంటగా ఉంది. ఇంతకాలం ఇరవై తొమ్మిది గ్రామాలకు మాత్రమే పరిమితం అయిన ఈ ఉద్యయం ఇపుడు మహాపాదయాత్రతో ఏపీలోనూ రాజుకునే చాన్స్ ఉంది.

అలా వైసీపీ సర్కార్ ఒక వైపు ఉక్కిరిబిక్కిరి అవుతూంటే ఇపుడు విశాఖలో ఉక్కు ఉద్యమం కూడా తోడు అవుతోంది. విశాఖ గురించి వైసీపీ పాలకుల భాషలో చెప్పాలీ అంటే పరిపాలనా రాజధాని అన్న మాట. మరి అక్కడ కూడా ఊపిరిసలపనీయకుండా ఉద్యమం చెలరేగుతోంది. కేంద్రం పుణ్యామాని విశాఖ ఉక్కులో మంటలు రేగితే ఆ పాపం అంతా జగన్ కే అంటుకున్నేట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. జగన్ సైలెంట్ తో ఉక్కు కార్మిక లోకం మండుకుపోతోంది. కేంద్రం మీద వత్తిడి పెంచాలని విపక్షం గట్టిగా గద్దిస్తోంది. ఆఖరుకు సీన్ ఎంతదాకా వచ్చింది అంటే ఏపీ బీజేపీ కూడా జగన్నే కార్నర్ చేస్తోంది. జగన్ సర్కార్ అభిప్రాయం ఏంటో చెపాలని బీజేపీ నేతలు నిగ్గదీస్తున్నారు. జగన్ అఖిల పక్ష సమావేశాన్ని పిలవాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు. తాము కూడా దానికి హాజరవుతామని ఆయన చెబుతున్నారు. అంటే జగనే విశాఖ ఉక్కు విషయంలో కర్త, కర్మ, క్రియ అంటున్నాయి ఏపీ విపక్షాలు అన్న మాట.

ఇలా ఒక్కసారిగా అటూ ఇటూ ఉద్యమ సెగలు రేగడం మాత్రం జగన్ సర్కార్  తట్టుకోలేనిదే. ఈ విషయంలో జగన్ ఏ విధంగా ఆలోచిస్తారో, ఎలా వీటి నుంచి బయటపడతారో అన్నది చూడాలి. ఏది ఏమైనా కూడా ఏపీలో మాత్రం మెల్లగా మొదలైన ఈ ఉద్యమాలు పీక్స్ చేరుకునే విధంగానే సాగుతున్నాయి. వీటికి తోడు మరిన్ని ఉద్యమాలు ప్రజా సమస్యల మీద నిర్మించడానికి కూడా ప్రతిపక్షాలు సిధ్ధం అవుతున్నాయి. అంటే ఇది ఉద్యమాల టైమ్. అధికార పార్టీకి బ్యాడ్ టైమ్ లాగానే ఉంది మరి.
Tags:    

Similar News