చిన్న‌మ్మ మొగుడి క‌క్కుర్తికి జైలుశిక్ష‌

Update: 2017-11-18 04:19 GMT
కొన్ని విష‌యాలు వింటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. కోట్లాది రూపాయిలు ఉంచుకొని కూడా ప‌డే క‌క్కుర్తి వారి స్థాయిని త‌గ్గించ‌ట‌మే కాదు.. లేనిపోని త‌ల‌నొప్పుల్ని తెచ్చి పెట్టేలా చేస్తుంది. త‌మిళ‌నాడు అమ్మ‌కు అత్యంత స‌న్నిహితురాలైన ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ అలియాస్ చిన్న‌మ్మ వైభోగం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

సంప‌ద‌కు కొద‌వ లేని జీవితం వారిది. మ‌రి.. అలాంట‌ప్పుడు కూడా క‌క్కుర్తి ప‌డ‌తారెందుకు? అన్న సందేహం రాక మాన‌దు. ఖ‌రీదైన విదేశీ కారును కొన్న శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ్.. దాన్ని దిగుమ‌తి చేసుకునే ద‌గ్గ‌ర మ‌హా క‌క్కుర్తి ప్ర‌ద‌ర్శించారు. ఖ‌రీదైన విదేశీ కారు అంటే చ‌ట్ట‌ప్ర‌కారం భారీగా ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. సంప‌ద‌కు కొద‌వ లేకున్నా ద‌ర్పం కోస‌మో.. త‌మకున్న ప‌వ‌ర్ ను ప్ర‌ద‌ర్శించాల‌నుకున్నారో కానీ..  ఆ కారును సెకండ్ హ్యాండ్ కారుగా చెప్పి ప‌న్ను ఎగ్గొట్టారు.

ఇలాంటి త‌ప్పులు అంతా బాగున్న‌ప్పుడు ఓకే కానీ.. లెక్క తేడా వ‌చ్చిన‌ప్పుడే క‌ష్ట‌మంతా. దాదాపు ఇర‌వై ఏళ్ల కింద‌ట ప‌డిన క‌క్కుర్తి ఇప్పుడు జైలుకు వెళ్లేలా చేసింది. 1994 సెప్టెంబ‌రులో శ‌శిక‌ళ భ‌ర్త లండ‌న్ నుంచి లెక్సెస్ ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశారు. ప‌న్నుపోటు త‌ప్పించుకునేందుకు వీలుగా అది సెకండ్ హ్యాండ్ కారుగా చెప్పి క‌వ‌ర్ చేశారు.

త‌ర్వాతి కాలంలో ఆ క‌క్కుర్తి కాస్తా కేసు అయ్యింది. దీనిపై వాయిదాల మీదా  వాయిదాలతో ఇంత‌కాలం గ‌డిచిన త‌ర్వాత తాజాగా తీర్పు వ‌చ్చేసింది. ప‌న్ను ఎగ్గొట్టి క‌స్ట‌మ్స్‌ శాఖ‌ను  మోస‌గించిన కేసులో శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ‌న్ తో పాటు.. ఆమె అక్క కుమారుడు భాస్క‌ర‌న్  మ‌రో ఇద్ద‌రికి కోర్టు జైలు శిక్ష‌ను ఖ‌రారు చేశారు. ఈ కేసులో చిన్న‌మ్మ భ‌ర్త‌కు రెండేళ్ల జైలును విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇటీవ‌ల అనారోగ్యానికి గురై.. శ‌స్త్ర‌చికిత్స‌లు చేయించుకున్న వేళ‌.. కోర్టు తీర్పుతో కొత్త తిప్ప‌లు త‌ప్ప‌న‌ట్లే.
Tags:    

Similar News