నిజంగానే మంత్రి నియోజకవర్గంలో అంత తక్కువ ఓట్లు పడ్డాయా?

Update: 2020-01-31 08:39 GMT
ఏదైనా ఒక సమస్య దేశాన్ని కుదిపేస్తే ఏం చేస్తారు.. రెఫరెండం నిర్వహిస్తారు. భారత దేశంలో ఇప్పటివరకూ మన పాలకులు ఈ రెఫరెండం జోలికి పోలేదు. విదేశాల్లో ఈ సంస్కృతి ఉంది. ఇటీవలే యూరోపియన్ యూనియన్ లో ఉండాలా వద్దా అన్న దానిపై బ్రిటన్ దేశం రెఫరెండం నిర్వహించగా.. విడిపోవాలని ఆ దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు. దీంతో బ్రిటన్ ఈయూ నుంచి ఎగ్జిట్ అయిపోయింది.

ఇప్పుడు దేశంలోనూ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టంపై రెఫరెండం నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు మెజార్టీ ప్రజాభిప్రాయం తెలుసుకోవడం అనేది   సహేతుక నిర్ణయమే మరీ..

అయితే ఏపీలోనూ ఈ సమస్య ఉంది. ఏపీకి 3 రాజధానులు అవసరం అని సీఎం జగన్ బిల్లు పాస్ చేయగానే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు హర్షం వ్యక్తం చేసి జగన్ కు క్షీరాభిషేకాలు చేశారు. అదే సమయంలో అమరావతి అగ్నిగుండంగా మారింది.ఇప్పటికే రాజధాని మార్చవద్దంటూ అక్కడ పోరాటాలు చూస్తున్నాం..

అయితే తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో జేఏసీ ఆధ్వర్యంలో ఆశ్చర్యకరంగా రాజధాని మార్పు నిర్ణయం సరైందేనా కాదా అన్న దానిపై రెఫరెండం నిర్వహించారు. అమరావతి రాజధాని పరిధిలోనే ఉండడంతో దీని ఫలితం ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

గుడివాడ - గుడ్లవల్లేరులో నియోజకవర్గ ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. గుడివాడ సెంటర్ - ఏలూరు రోడ్డు - మార్కెట్ కూడలి - గుడ్లవల్లేరు కూడలిలో బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందరూ ఇందులో ఏపీ రాజధానిపై ఓట్లు వేశారు.

ఏపీ రాజధానిపై నిర్వహించిన ఈ రెఫరెండంలో మొత్తం 6909 ఓట్లు పోలవగా.. ఏకంగా 6573 ఓట్లు అమరావతికి అనుకూలంగా పడడం విశేషం. 328 ఓట్లు మూడు రాజధానులకు అనుకూలంగా వచ్చాయి.. 8 ఓట్లు చెల్లలేదు.

ఏపీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న  నియోజకవర్గంలో నిర్వహించిన ఈ రెఫరెండం ఆసక్తి రేపింది. మంత్రి నియోజకవర్గంలో ఏకంగా 95శాతం జనాలు అమరావతికే సపోర్టు చేయడం విశేషం.  ఈ ఫలితం చూశాక జేఏసీ నేతలు స్పందించారు. ఈ ఫలితాలు చూసైనా సీఎం జగన్ ఆంధ్రుల రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు.

అయితే ఇదే రెఫరెండం.. రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిర్వహిస్తే 3 రాజధానులకు అనుకూలంగా ఇదే ఫలితం వస్తుంది. సో రెఫరెండం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా చేస్తే అసలైన ఫలితం వస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News