అనగనగా ఒక వీఆర్వో.. జస్ట్ 2320 ఎకరాల్ని పిల్లలకు ఇచ్చేశారు

Update: 2021-10-04 04:48 GMT
వినేందుకు షాకింగ్ గా ఉన్నా.. ఇది నిజం. ప్రభుత్వానికి చెందిన 2320 ఎకరాల భూమిని వీఆర్వోగా పని చేసే ఒక చిరుద్యోగి (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాంటి పదవులతో పోల్చినప్పుడు) తన పిల్లకు కట్టబెట్టేసిన షాకింగ్ నిజం తాజాగా బయటకు వచ్చింది. నకిలీ ధ్రువపత్రాల్ని క్రియేట్ చేసి.. 1577 ఎకరాల భూమిని ఏకంగా ఒకే రోజు ఆన్ లైన్ లో నమోదు చేసిన వైనం షాకింగ్ గా మారింది. సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని కాజేసే ఈ కుంభకోణాన్ని తాజాగా సీఐడీ పోలీసులు బయటెట్టారు. చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జిల్లాకు చెందిన మోహన్ గణేశ్ పిళ్లై వారసత్వ రీత్యా 1977 నుంచి గ్రామకరణంగా పని చేశారు. తర్వాత వీఏవోగా.. వీఆర్వోగా పని చేసి 2010లో రిటైర్ అయ్యారు.ఈ క్రమంలో జిల్లాలోని సోమల.. పుంగనూరు.. పెద్ద పంజాణి.. బంగారుపాళెం.. యాదమరి.. చిత్తూరు.. కేవీపల్లె.. గుర్రంకొండ.. చంద్రగిరి.. ఏర్పేడు.. సత్యవేడు.. రామచంద్రాపురం.. తంబళ్లపల్లో మండలాల్లోని 18 గ్రామాల్లోని అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న 2320 ఎకరాల భూమిని తన తండ్రికి వారసత్వంగా వచ్చినట్లుగా పత్రాల్ని క్రియేట్ చేశాడు.

అక్కడి నుంచి మొదలైన అతని ఆరాచకం.. ఆ భూమి తన తండ్రి తన తల్లికి 1981లో బదలాయించినట్లుగా తప్పుడు రికార్డులు తయారు చేసి.. ఆ భూమిని తన తల్లి తన మనమళ్లకు మనమరాళ్లకు చెందేలా వీలునామా తయారు చేయించాడు. దీన్ని 1985లో బంగారుపాళ్యం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించటం గమనార్హం. 2005-10 మధ్యలో చిత్తూరు జిల్లాలోని భూముల వివరాల్ని ఆన్ లైన్ లో నమోదు చేశారు.

ఈ క్రమంలో తన కొడుకు మధుసూదన్ సాయం తీసుకున్న గణేశ్ 2009 జులై ఒకటిన తన నలుగురు పిల్లల పేరుతో 59 సర్వే నంబర్లకు సంబంధించి 1577 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయించారు. తర్వాత మీ సేవా కేంద్రాల నుంచి అడంగల్.. 1బీ కాపీలు పొందిన అతను నకిలీ పత్రాల్ని తయారు చేసి ఆ భూమిని పది మందికి అమ్మాడు. మరి.. ఇంత భారీ స్కాం ఎలా బయటకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. 160 ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని దరణి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సర్వే నెంబరులో 45.62 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉండటంతో సోమల తహసీల్దారు ప్రాథమిక విచారణ చేపట్టారు.

అనంతరంలెక్క తేడాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ విషయం మీద 2020 మే నుంచి దర్యాప్తు చేస్తున్న అధికారులు తాజాగా ఈ మొత్తం కుంభకోణాన్ని గుర్తించారు.

నిందితుల నుంచి 40 పత్రాలు.. స్టాంపులు.. నకిలీ పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివి తవ్వుకుంటూ పోతే.. ఇంకెన్ని ఆరాచకాలు బయటకు వస్తాయో?
Tags:    

Similar News