ప్రగతిభవన్ లంచ్ కు ఉండవల్లిని పిలుస్తూ ప్రత్యేకంగా అలా అడిగారట

Update: 2022-06-14 03:00 GMT
తెలంగాణ సాధన.. బంగారు తెలంగాణ.. తాజాగా దేశ రాజకీయాల మీద ఫోకస్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దానిపై అదే పనిగా కసరత్తు చేస్తున్నారు. గంటల కొద్దీ సమయాన్ని ఆ అంశం మీదనే ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టే వారిని ఒక చోటకు చేరుస్తున్నారు.

ఈ క్రమంలో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం మీద తన గళాన్ని విప్పే ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను ప్రగతిభవన్ లో లంచ్ కు ఆహ్వానించటం తెలిసిందే.

కావాలనుకున్నప్పుడు కౌగిలించుకోవటం.. అవసరం లేదనుకున్నప్పుడు ఈసడించుకోవటం లాంటివి సీఎం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. ఉండవల్లి విషయంలోనూ తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు కేసీఆర్. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్ కు లంచ్ కు రావాలన్న ఆహ్వానాన్ని అందుకున్న ఆయన.. అందుకు తగ్గట్లే వెళ్లి రావటం తెలిసిందే.

లంచ్ భేటీ సందర్భంగా ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? లాంటి అంశాల్ని ఉండవల్లి ఇప్పటికే చెప్పేశారు. కాకుంటే.. తన ఫ్లోలో భాగంగా ఉండవల్లి చెప్పిన కొన్ని అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. తాను పిలిచిన గెస్టు విషయంలో సీఎం కేసీఆర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం కళ్లకు కట్టేలా కనిపించక మానదు.

తనను లంచ్ కు ఆహ్వానించిన ప్రగతిభవన్ సిబ్బంది.. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేశారని.. ఏమేం తింటారిన అడిగినట్లుగా ఉండవల్లి వెల్లడించారు. అంతేకాదు.. తాను వెజ్.. నాన్ వెజ్ అన్న విషయం తెలుసుకోవటం కోసం ప్రత్యేకంగా ఫోన్ చేసి.. ఆ వివరాల్ని కూడా అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. తాను వెజ్ మాత్రమే తింటానని చెప్పినట్లు వెల్లడించారు.

లంచ్ కు వెళ్లిన సందర్భంగా సీఎం కేసీఆర్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..ఇద్దరు మంత్రులు.. ఒక ఎంపీ.. తాను మాత్రమే ఉన్నట్లు చెప్పారు. లంచ్ కు వడ్డించిన ఫుడ్ మొత్తం వెజ్ మాత్రమే కావటం గమనార్హం. తన కోసం కేసీఆర్ సైతం ఆ రోజున వెజ్ తిన్నట్లుగా పేర్కొన్నారు. ఇంటిని అతిధిని పిలవటం ఒక ఎత్తు. అతగాడి మనసును పూర్తిగా దోచేయటం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లో సీఎం కేసీఆర్ ను మించినోళ్లు మరొకరు ఉండరనే చెప్పాలి.
Tags:    

Similar News