పవన్ కు షాక్.. జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్ బై

Update: 2020-01-30 13:15 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెబుతూ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. గడిచిన కొద్దికాలంగా పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో పాటు.. పవన్ వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాను పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లుగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు రాసిన లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకే అని చెప్పి.. సినిమాల్లో నటించనని పవన్ చాలాసార్లు చెప్పారని.. మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం చూస్తే.. మీలో నిలకడలేని తత్త్వం ఉందన్న వాదనను తెర మీదకు తెచ్చిన లక్ష్మీనారాయణ.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు.

విశాఖ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మీనారాయణ ఓటమిపాలైన విషయం తెలిసిందే. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు.. ఓటు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. తాను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు.. కార్యకర్తలకు.. వీర మహిళలకు.. ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన.. అందరికి మంచి జరగాలని.. భగవంతుడి ఆశీస్సులు ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాతే జనసేనాధినేతకు.. లక్ష్మీనారాయణకు మధ్య విభేదాలు పొడచూపినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. ఆయన పవన్ తో కలిసి పెద్దగా వేదికల్ని పంచుకోలేదు. వివిధ అంశాల మీద నిరసనలు నిర్వహించినా.. పవన్ వెంట ఆయన ఉండకపోవటాన్ని మర్చిపోకూడదు. తాజాగా తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతూ.. అందుకు కారణం పవన్ తీరే అన్న విషయాన్ని వేలెత్తి చూపించి మరీ వెళ్లిపోవటం పవన్ కు గట్టి దెబ్బేనని చెబుతున్నారు. మరి.. లక్ష్మీనారాయణ నిష్క్రమణ మీద జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News