కేసీఆర్ పిలుపు కోసం ‘‘వెరీవెరీ స్పెషల్’’ రెఢీ

Update: 2016-03-30 04:23 GMT
ఒక సెలబ్రిటీ.. అందునా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న ఒక మాజీ క్రికెటర్ గులాబీ పార్టీపై మనసు పడటం కాస్తంత ఆసక్తి కలిగించే అంశమే. తన పని ఏదో తాను అన్నట్లుగా వ్యవహరించే అతగాడు.. తన స్టైల్ కి భిన్నంగా వ్యవహరించటమే కాదు.. తన మనసులోని మాటను నర్మగర్భంగా చెప్పినవైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాస్త ఆలస్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని చేరిందా? అన్నది ఇప్పుడో ప్రశ్న. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్ మెన్ గా పేరున్న హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గులాబీ కలర్ షర్ట్ వేసుకోవటమే కాదు.. ఊహించని వ్యాఖ్య ఒకటి చేశారు.

ఇటీవల ముగిసిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీ సందర్భంగా మ్యాచ్ వ్యాఖ్యాతల్లో ఒకరిగా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ పింక్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్లాడు. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకునే క్రమంలో లక్ష్మణ్ వేసుకున్న గులాబీ కలర్ షర్ట్ చూస్తూ.. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే రియాక్ట్ అయ్యారు. గ్లోరియస్ పింక్ అంటూ చేసిన వ్యాఖ్యకు స్పందించిన వీవీఎస్.. ‘‘ఈ రంగు తెలంగాణ రాష్ట్రం కలర్. ఈ కలర్ చొక్కా వేసుకొని తెలంగాణకు మద్దతు ఇస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

వీవీఎస్ చేసిన వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పింక్ కలర్ తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష పార్టీ కలర్ తప్పించి.. తెలంగాణ రాష్ట్ర కలర్ ఎంతమాత్రం కాదు. ఈ తరహా వ్యాఖ్య వీవీఎస్ తెలిసి చేశారా? తెలియక చేశారా? లేక.. మరేదైనా కారణంతో చేశారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి తన మాటతో తెలంగాణ స్టేట్ కలర్ పింక్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన పార్టీ కలర్ ని తెలంగాణ స్టేట్ కలర్ గా ఫీల్ కావటమే కాదు.. అందరికి ప్రచారం చేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్  ను కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవటమే ఆలస్యమేమో..?
Tags:    

Similar News