ఆ వెయిటర్ మామూలోడు కాదు సుమి

Update: 2015-12-20 04:12 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు సైతం నిజాయితీగా వ్యవహరించని పరిస్థితి. అలాంటిది ఒక వెయిటర్ ప్రదర్శించిన నిజాయితీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మనసు మార్చే కాసుల్ని అస్సలు పట్టించుకోని అతగాడి గురించి ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక రెస్టారెంట్ వెయిటల్ వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజాయితీతో వ్యవహరించటమే కాదు.. బహుమానంగా ఇచ్చే సొమ్మును కూడా వద్దని చెప్పటం చూస్తే.. గ్రేట్ అనిపించక మానదు.

కాలిఫోర్నియాలోని ఫ్రెన్సోలోని యాపిల్ బీ రెస్టారెంట్ కు ఇటీవల ఒక ఫ్యామిలీ వచ్చి భోజనం చేసి వెళ్లింది. వారు వెళ్లిన తర్వాత టేబుల్ దగ్గరకు వచ్చిన వెయిటర్ కు ఒక పర్స్ కనిపించింది. దాని చూస్తే.. రూపాయిల్లో అయితే రూ.22లక్షలు ఉన్నాయి. వెంటనే.. అతగాడు ఆ సొమ్మును తీసుకొని యజమానికి అప్పగించారు.

పోలీసులకు ఈ సమాచారం ఇవ్వటంతో.. ఆ కుటుంబం కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఇదే సమయంలో సదరు కుటుంబం తాము పోగొట్టుకున్న పర్సు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ విషయాన్ని సదరు వెయిటర్ పోలీసులకు చెప్పిన నేపథ్యంలో.. బాధిత కుటుంబానికి ఆ పర్సు అందజేశారు. అందులో ఒక్క పైసా కూడా తేడా రాలేదంటూ వెయిటర్ ను బాధిత కుటుంబం అభినందించి.. తమకు ఇంత పెద్ద సాయం చేసిన వెయిటర్ కు కాసిన్ని డబ్బులు బహుమానంగా ఇవ్వబోయారు.

అయితే.. ఆ మొత్తాన్ని సదరు వెయిటర్ తిరస్కరించటం కొసమెరుపు. తానేమీ గొప్ప పని చేయలేదని.. తన పని మాత్రమే తను చేశానంటూ ఒద్దిగా చెప్పిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది.
Tags:    

Similar News