‘‘కార్డు’’ల మొనగాడు

Update: 2016-01-08 04:38 GMT
జేబులో నాలుగు క్రెడిట్ కార్డులు ఉంటే ఆ తికమక అంతాఇంతా కాదు. దేని బిల్లు ఎంత? ఎప్పటికి కట్టాలి? దేని గడువు ఏంత? లాంటి ప్రశ్నలతో పాటు.. ఇన్నేసి కార్డులు ఎందుకు.. కాసిన్ని తగ్గించుకుంటే పోలా అన్న భావన కలగక మానదు. గతంతో పోలిస్తే.. ప్లాస్టిక్ కార్డులతో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించటం పెరిగిపోయిన నేపథ్యంలో.. ప్రతి ఒక్కరి జేబులోని పర్సు కార్డులతో నిండిపోతున్న పరిస్థితి. నాలుగు కార్డులకు ఇంత కిందామీదా పడే సగటు జీవికి అమెరికాకు చెందిన వాల్టర్ అనే పెద్దమనిషి గురించి తెలిస్తే నోట మాట రాని పరిస్థితి.

కాలిఫోర్నియాకు చెందిన ఇతగాడి దగ్గర ఉన్న కార్డులు ఎన్నో తెలుసా? అక్షరాల 1497. ఈ వార్త మీరు చదివే నాటికి మళ్లీ.. ఒకటో.. రెండో కార్డులు ఇతని ఖాతాలోకి వెళ్లిపోయి ఉంటాయి. ఎందుకంటే.. కొత్త కార్డులు సేకరించటం ఇతనికో అలవాటు. 1960లలో ఇలా కార్డుల సేకరణ మీద దృష్టిపెట్టిన ఇతగాడి దగ్గర ఇప్పుడు వందలాది కార్డులు ఉంటాయి. దీంతో.. ఎప్పుడు ఏ కార్డు వాడాలో కాసింత తికమక పడిపోతాడంట.

ఇన్నేసి కార్డులు ఎందుకు? వాటితో ఏం చేస్తాడు? లాంటి ప్రశ్నలు వేస్తే.. ఆసక్తికర సమాధానం వస్తుంది. తన స్నేహితుడితో వేసుకున్న ఛాలెంజ్ తో కార్డుల సేకరణ మీద దృష్టి పెట్టిన వాల్టర్.. కేవలం ఏడాది వ్యవధిలో 143 కార్డులు సేకరించాడు. సరదాకు గిన్నిస్ వారిని సంప్రదిస్తే.. ఎక్కువ కార్డులున్న వ్యక్తిగా ఇతని పేరు మీద రికార్డు ఇచ్చేశారు.

అప్పటి నుంచి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ.. ఎవరూ తన రికార్డుకు దగ్గరకు రాకుండా ఉండేలా చూసుకుంటూ.. నిత్యం కొత్త కార్డుల్ని అప్లై చేసుకోవటంతో తెగ బిజీగా ఉంటాడట. బ్యాంక్ క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి.. బ్యాంకుల డెబిట్ కార్డులు.. ఎయిర్ లైన్స్.. గ్యాస్ స్టేషన్ల దగ్గర ఇచ్చే కార్డులు.. మాల్స్ కార్డులు.. ఇలా ఒకటేమిటి? చాలానే కార్డులు ఇతగాడి వద్ద ఉంటాయి. ఆయన దగ్గరున్న కార్డుల క్రెడిట్ లిమిట్ ఎంతో తెలుసా? రూ.11.33కోట్లు మాత్రమేనట. కార్డుల పెద్దమనిషి కథ ఆసక్తికరంగా ఉన్నా.. అన్నేసి కార్డుల్ని ఎలా మొయింటైన్ చేస్తున్నాడో..?
Tags:    

Similar News