ఆర్యన్ కేసు నుంచి వాంఖడే ఔట్.. ఎందుకిలా?

Update: 2021-11-06 04:42 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసుల విచారణాధికారిని తప్పించే విషయంలో కొత్త ఎత్తులు మొదలయ్యాయి. నిలువెత్తు నిజాయితీ.. ముక్కుసూటి దానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే సమీర్ వాంఖడేను తప్పిస్తూ ఎన్ సీబీ నిర్ణయం తీసుకుంది. అయితే.. దీని వెనుకున్న లెక్కలు వేరుగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నా.. అందుకు భిన్నమైన వాదనను మరికొందరు వినిపిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వాంఖడే స్థానంలో మరో సమర్థమైన అధికారికి కేసును బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో పాటు.. మరికొందరు బడా బాబుల కేసులు ఆయన విచారణ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఎపిసోడ్ కు ముందు వాంఖడే చేతిలో మహారాష్ట్ర మంత్రి కమ్ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్.. మరో నటుడు ఆర్మాన్ కోహ్లి కేసులు కూడా ఉన్నాయి. ప్రముఖుల కేసుల్ని డీల్ చేసే వేళలో.. సదరు విచారణ అధికారికి ఎదురయ్యే తలనొప్పులే వాంఖడేకు ఎదురయ్యాయి. ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. ఇక.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అయితే.. వాంఖడేనే వెంటబడినట్లుగా వరుస ఆరోపణలు చేసి ఉక్కిరిబిక్కిరి చేశారు.

అన్నింటికి మించిన డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను విడిచి పెట్టటానికి రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని.. అందులో వాంఖడే వాటా రూ.8కోట్లుగా ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారటమే కాదు.. వాంఖడే మీద వేలెత్తి చూపేలా చేయటంలో రాజకీయం సక్సెస్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన కుల ధ్రువీకరణకు సంబంధించిన ఆరోపణలతో.. కేసు విచారణ సంగతి పక్కన పెట్టి.. తన మీద పడిన ఆరోపణ మరకల్ని తుడుచుకోవటంలో బిజీ అయ్యారు.

వాంఖడే సంగతి చూడాలన్న రీతిలో ఆయనపై ఎదురుదాడి తీవ్రమైన వేళ.. కేంద్రం మీదా ఒత్తిళ్లు పెరిగినట్లుగా విమర్శలు ఉన్నాయి. ఇలాంటివేళలోనే.. వాంఖడేను డ్రగ్స్ విచారణ నుంచి తప్పించటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆర్యన్ డ్రగ్స్ కేసుతో సహా ఆరు కేసుల్ని ముంబయి జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్ సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కేసుల్ని విచారించటానికి ఎన్ సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు టీంను ఏర్పాటు చేశారు.

అదే సమయంలో వాంఖడేను మాత్రం ముంబయి జోనల్ డీజీగా కొనసాగుతారని చెప్పటం గమనార్హం. చూస్తుంటే.. వాంఖడే చేతుల్లో ఉన్నకీలకమైన కేసుల్ని ఢిల్లీకి బదిలీ చేయటం.. మరోవైపు ఆయనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణల నుంచి బయటపడేందుకు కిందామీదా పడేలా చేసి.. పోస్టు మార్చకుండా చేతులు కట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది. రాజకీయం పన్నిన ఈ పద్మవ్యూహం నుంచి వాంఖడే బయటకు వస్తారా? అందులోనే ఇరుక్కుపోతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు వాంఖడే నుంచి తప్పించిన కేసును సంజయ్ కు అప్పజెప్పటం ద్వారా కేంద్రం తనదైన రీతిలో ఆటను ఆడుతుందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News