గ్యాంగ్ రేప్ కేసు: వక్ఫ్ బోర్డు చైర్మన్ పోస్ట్ ఊస్ట్ అయినట్టే?

Update: 2022-06-09 14:12 GMT
కుమారుడు చేసిన పనికి పాపం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి పోయేట్టు ఉంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం కేసు ఘటనలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వక్ఫ్ బోర్డు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తక్షణం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది.అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు రావడంపై పార్టీ సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకునే బాధ్యతను హోంమంత్రి మహమూద్ అలీకి పార్టీ అప్పగించింది. పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాకు హోంమంత్రి సూచించారు.

ఈ రేప్ కేసు వక్ఫ్ బోర్డు చైర్మన్ చుట్టూ తిరుగుతోంది. ఆయన తనయుడు రేప్ కేసులో అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఆయన పోస్టుకు ఎసరు వచ్చింది.. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగిందని చైర్మన్ తొలగింపు బోర్డు పరిధిలో ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ ఇదివరకే తెలిపారు. హైదరాబాద్ రేప్ వ్యవహారంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారని స్పష్టం చేశారు.  అయితే తెలంగాణలో ఈ కేసు సంచలనం కావడంతో వెంటనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ ఆదేశించింది.

బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా? లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా? అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్ నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది.

వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.

మరోవైపు వాహనం ఎవరిది అన్న దానిపై వివరాలు ఇవ్వాలని దినాజ్ జహాన్ తోపాటు వక్ఫ్ బోర్డ్ కు నోటీసులు ఇవ్వాలని.. లేఖ రాయాలని పోలీసులు నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే అది వక్ఫ్ బోర్డు లీజుకు తీసుకొని చైర్మన్ కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అన్నది స్పష్టత రానుంది.

ఇక అత్యాచారంలో వినియోగించిన బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని.. దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్ కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News