కుప్పం వైసీపీలో వర్గపోరు..ఎమ్మెల్సీ భరత్ పీఏపై దాడి

Update: 2022-09-01 11:41 GMT
మొన్నటి వరకు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న రీతిలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా కుప్పం వైసీపీలో సాగుతున్న అంతర్గత పోరు ఇపుడు తాజాగా బట్టబయలైంది.

కుప్పం వైసీపీలోని ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడం, పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కుప్పం ఇన్ చార్జి, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్ కు ఈ ఘర్షణలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్, భరత్ పీఏ అయిన మురుగేష్‌ పై వైసీపీకి చెందిన మరికొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. మురుగేష్ తలకు తీవ్ర గాయాలు కాగా...ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మురుగేష్ తలపై 14 కుట్లు వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మురుగేష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. కుప్పం బైపాస్ రోడ్డులోని మంజునాథ్ రెసిడెన్సీలో జరిగిన గొడవ ముదిరి పాకానపడి తారస్థాయికి చేరుకుందని తెలుస్తోంది. ఈ దాడిలో మురుగేష్ తో పాటు మరో వైసీపీ నేత సుబ్రహ్మణ్యంకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో కుప్పం మున్సిపల్ ఛైర్మన్ పీఏ రాము కూడా అక్కడే ఉన్నారని తెలుస్తోంది.

అయితే, మురుగేష్‌ పై 12వార్డు కౌన్సిలర్, కుప్పం మున్సిపల్ వైస్ ఛైర్మన్ మునిస్వామి దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పాత కక్షలతోనే మంజునాథ రెసిడెన్సీలో మద్యం పార్టీకి ఆహ్వానించి మురుగేష్ పై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ ఘటన పై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన సమాచారమందుకున్న పోలీసులు ఏం జరిగిందన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News