వరంగల్ ను వదిలే టైమొచ్చింది

Update: 2015-11-19 04:12 GMT
వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపునకు వచ్చేసింది. గురువారం (ఈ రోజు) సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారం ముగిసి.. పోలింగ్ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో.. నిబంధనలకు అనుగుణంగా.. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు లేని నేతలంతా జిల్లాను వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా ఎన్నిక సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పష్టం చేశారు.

వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బరిలోని అన్ని రాజకీయ పార్టీలు భారీగా తమ క్యాడర్ ను మొహరించాయి. ఎవరి వరకో ఎందుకు.. అధికారపార్టీకి చెందిన నేతల్నే తీసుకుంటే.. వరంగల్ లోక్ సభా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు మంత్రుల్ని నియమించి.. ప్రచారాన్ని చేపట్టటంతో పాటు.. ఎన్నికలకు సంబంధించిన మొత్తం ప్రక్రియను అప్పజెప్పింది. ఇదే తీరులో మిగిలిన పార్టీలు తమకు తోచినట్లుగా క్యాడర్ ను దింపి.. ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది.

తాజాగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి సూచన మేరకు.. గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో.. స్థానిక నేతలు తప్పించి.. ఓటుహక్కు లేని నేతలంతా జిల్లాను విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు.. బల్క్ మెసేజ్ లు.. కోడ్ ను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News