హుందా మ‌రిచి..వెకిలి స్పీచ్ ఏంది అమ్ర‌పాలి?

Update: 2018-01-27 04:45 GMT
కొన్ని స్థానాల‌కు ఉండే గౌర‌వం.. మ‌ర్యాద‌.. హుందాత‌నం వేరు. ఆ స్థానాల్లో ఉన్న వారు.. తామున్న స్థానాల ప్ర‌తిష్ఠ‌కు త‌గ్గ‌కుండా వ్య‌వ‌హ‌రించాలి.  ఒక ఐఏఎస్ అధికారిణిగా.. జిల్లాను రిప్ర‌జెంట్ చేసే ముఖ్య అధికారిణిగా బాధ్య‌త‌తో  ఉండాలి. ప్ర‌భుత్వానికి ప్రాతినిధ్యం వ‌హించే ఆమె.. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేళ చేసే ప్ర‌సంగం హుందాగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి వైఖ‌రి ఇప్పుడు వివాద‌స్ప‌దంగా మార‌ట‌మే కాదు.. న‌వ్వుల‌పాలైంది. జిల్లా క‌లెక్ట‌ర్ హోదాలో జిల్లా అభివృద్ధి గురించి వివ‌రాలు చెప్పాల్సిన ఆమె.. త‌న ప్ర‌సంగంలో ప‌లుమార్లు త‌డ‌బ‌డ‌టం ఒక ఎత్తు అయితే.. అవ‌స‌రం లేకున్నా న‌వ్వ‌టం.. కామెడీ చేయ‌టం విస్తుపోయేలా చేసింది.

జిల్లాలో తీవ్ర చ‌ర్చ‌కు తావిచ్చిన ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్లు ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్దికి సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డిస్తుంటారు. దీనికి భిన్నంగా అమ్ర‌పాలి ప్ర‌సంగం సాగింది.

అవ‌స‌రం లేకున్నా ప్ర‌సంగం మ‌ధ్య‌లో న‌వ్వ‌టం.. గ‌ణాంకాల్ని చెప్పేట‌ప్పుడు త‌డ‌బ‌డ‌టం ఒక ఎత్తు అయితే.. జిల్లాలో మ‌రుగుదొడ్ల నిర్మాణంలో ప్ర‌గ‌తి గురించి ప్ర‌స్తావించే స‌మ‌యంలో స్పీచ్ మ‌ధ్య‌లో వెన‌క్కి తిరిగి న‌వ్వి.. ఇట్స్‌.. ఫ‌న్నీ అంటూ వ్యాఖ్యానించ‌టం షాకింగ్ గా మారింది. అమ్ర‌పాలి  మాట మైకుల్లో బ‌య‌ట‌కు వినిపించ‌టంతో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన నేత‌లు.. మిగిలిన అధికారుల‌కు అమ్ర‌పాలి కంగాళీ స్పీచ్‌ కు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

జిల్లా క‌లెక్ట‌ర్ స్థానంలో ఉన్న ఒక కీల‌క అధికారి ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. అమ్ర‌పాలి స్పీచ్ వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ప‌లు సంద‌ర్భాల్లో చిత్ర‌విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేసే అమ్ర‌పాలి.. ఈసారి వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప్ర‌భుత్వం గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Full View
Tags:    

Similar News