‘రాజంపేట’ కోసం వైసీపీ నేతల మూకుమ్మడి రాజీనామాల వార్నింగ్

Update: 2022-02-08 09:30 GMT
తేనె తుట్టెను కదిపిన మాదిరి తయారైంది కొత్త జిల్లాల రగడ. లోక్ సభ స్థానాలకు అనుగుణంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచన విన్నప్పుడు ఓకేగా అనిపించినా.. అది కాస్తా రియాల్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం బోలెడన్ని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి.

కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున నిరసనలు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వినతులు అంతకంతకూ ఎక్కువ అవుతుంటే.. తాజాగా సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న అభ్యర్థులు.. హెచ్చరికలు అధికార పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.

అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట జిల్లా సాధన సమితి ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ జిల్లా ప్రధాన కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు అంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా సాధన కోసం రిలే దీక్షలు మొదలయ్యాయి.

రాజంపేట పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ పెరుగుతున్న కొద్దీ.. అధికారపార్టీ నేతలకు దాని వేడి తగులుతోంది. దీంతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వారు సైతం గళం విప్పుతున్నారు.

రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా సాధన కోసం ఓపక్క రిలే దీక్షలు సాగుతుంటే.. మరోవైపు తమ డిమాండ్ కు సానుకూలంగా స్పందించని పక్షంలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అధికార పార్టీకి కువైట్ ఎన్ఆర్ఐలు అల్టిమేటం జారీ చేశారు.

దీంతో.. స్థానిక వైసీపీ నేతలు సైతం రాజంపేటను కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలంటూ ఒత్తిడిని పెంచుతున్నారు. కొత్త జిల్లాలతో వస్తున్న వినతులు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Tags:    

Similar News