రాళ్ల దాడి జరిగినప్పుడు బాబు రియాక్షన్ బాగోలేదా?

Update: 2021-04-13 04:31 GMT
అనూహ్యమనే చెప్పాలి. రాష్ట్ర విపక్ష నేత ప్రచారం చేస్తున్న బహిరంగ సభలో గుర్తు తెలియని వారు రాళ్లదాడికి పాల్పడటం అందరూ ఖండించాల్సిందే. హింసకు తావు లేకుండా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇబ్బందికి గురి చేసేవే. తాజాగా తిరుపతిలోని కృష్ణాపురం పోలీసు స్టేషన్ కూడలిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

రాత్రి 7.45 గంటల వ్యవధిలో బాబు మాట్లాడుతున్నప్పుడు సమీపంలోని భవనాల నుంచి ఎవరో గుర్తు తెలియని వారు రాళ్లు విసిరారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్త గాయపడ్డారు. ఈ సందర్భంగా బాబు రియాక్టు అయిన పద్దతి బాగోలేదన్న మాట వినిపిస్తోంది. కార్యకర్తలపై రాళ్లదాడి జరిగినప్పుడు.. అందుకు కారణమైన వారిని నిలదీయాలే తప్పించి.. పోలీసుల్ని నిందించటం వల్ల లాభం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తానుపిలిచినా పోలీసులు రాలేదంటూ మండిపడిన ఆయన.. పోలీసులు తమ పని తాము చేయలేని రీతిలో చేతులు కట్టేశారని.. పాపం వారు మాత్రం ఏం చేయగలరన్న మాట బాబు నోటి నుంచి వచ్చి ఉంటే బాగుండేది. నిజానికి విపక్ష నేత సభకు 300 పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. కానీ.. రాళ్ల దాడి జరిగినంతనే.. బాబు తీవ్ర ఆగ్రహానికి గురై.. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రాళ్లు వేస్తే తాట తీస్తానన్న మాట చూస్తే.. రాళ్లు వేసిన దుండగులకు.. పోలీసులకు ఏదో లింకు ఉందన్నట్లుగా ఉంటుంది. ఇలాంటివి పోలీసుల్లో బాబు పట్ల కోపాన్ని మరింత పెంచేలా చేస్తాయి. ఒకవేళ.. ఫలానా పోలీసు తప్పు చేస్తున్నాడంటే.. ఆ పేరును ప్రస్తావిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా మొత్తం పోలీసుల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే.. ఏదో టార్గెట్ చేసినట్లుగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.

‘ఇంత పెద్ద మీటింగ్ లో పోలీసులు ఎవరూ లేరా? రండిరా తడాఖా చూపిస్తాం.. ధైర్యంగా ముందుకు రండి. తాడోపేడో తేల్చుకుందాం. సీఎంగా ఉన్నప్పుడు రౌడీయిజాన్నిఅణిచివేశా.. మళ్లీ వస్తా.. మీ తోక కట్ చేస్తా’ లాంటి డైలాగులతో పెద్దగా ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. వాస్తవానికి ప్రచార సభలో రాళ్ల దాడి జరిగితే.. అయ్యో పాపం అనిపించేలా ఉండాల్సిన సీన్ కాస్తా.. అందుకు భిన్నమైన ఇమేజ్ వచ్చేలా బాబు మాటలు ఉన్నాయని.. అలాంటి వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.మరి.. బాబుకు అర్థమవుతుందా?
Tags:    

Similar News