ఆ 25 ఎకరాల విలువైన భూ వివాదంలో 60-40 డీల్ కుదిరిందా?

Update: 2022-04-26 02:30 GMT
సరిగ్గా 2021 ప్రారంభంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ భూ వివాదం కలకలం రేపింది. అది కూడా విలువైన భూమి కావడంతో వివాదం మరింత రాజుకుంది. దీనికితోడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధుల బంధువులు ఉండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భూమితో ప్రత్యక్ష సంబంధమున్న విభజిత ఏపీ నేత హఠాన్మరణంతో లొల్లి అనేక మలుపులు తిరిగింది. ఆయన అత్యంత సన్నిహితుడు తర్వాతి కాలంలో వారి కుటుంబానికి దూరం కావడం.. దివంగత నేత వారసులు రంగంలోకి దిగడం.. వారు తెలంగాణ ముఖ్య నేత బంధువుల జోలికి వెళ్లడం తీవ్రంగా చర్చనీయాంశమైంది.

కిడ్నాప్ కలకలం

సాధారణంగా రాజకీయ అండ ఉన్నవారి జోలికి ఎవరూ తొందరగా వెళ్లరు. అందునా ముఖ్య నేతలతో బంధుత్వం ఉన్నవారి జోలికి అసలు వెళ్లరు. అయితే, ఈ ఘటనలో ఏపీ మాజీ ప్రజాప్రతినిధి వర్గం.. తెలంగాణ ముఖ్య నేత బంధువులను అపహరించింది. కేంద్ర ప్రభుత్వ అధికారుల తరహాలో వెళ్లి వారిని ఎత్తుకెళ్లింది. అయితే, అనూహ్యంగా ఈ ప్రయత్నం విఫలమైంది. పథకం బయటపడి ఆ మాజీ ప్రజాప్రతినిధి అరెస్టు కావాల్సి వచ్చింది.

ఇక ఆమె భర్త పరారీ అయ్యారు. చాలాకాలం పాటు ఆయన పోలీసులకూ దొరకలేదు. దీనికితోడు కొవిడ్ నకిలీ సర్టిఫికెట్ సమర్పించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. అయితే, ఇందులోనూ కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. నిజాలు తర్వాత బయటకు రాలేదు. మాజీ ప్రజా ప్రతినిధి అత్తను సైతం ఈ కేసులో పోలీసులు విచారించినట్లు సమాచారం. వారికిచెందిన విద్యా సంస్థల వద్ద కూడా కొన్నాళ్లు పోలీసు హడావుడి కనిపించింది.

వ్యక్తిగత సంతోష సమయంలో..

వాస్తవానికి కిడ్నాప్ వ్యవహారం సమయంలో ఆ మాజీ ప్రజాప్రతినిధి.. వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని ఆస్వాదించాల్సిన సందర్భంలో ఉన్నారు. కానీ, అనుకోని ఘటనతో ఆమె పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అందులోనూ తెలంగాణ ముఖ్యనేత బంధువుల అపహరణకు చెందిన విషయం కావడంతో పోలీసులు తీవ్ర స్థాయిలోనే స్పందించారు. చివరకు ఈ కేసుల ప్రభావం ఆమెపై తీవ్రంగానే కనిపించింది.

అసలే పదవిలో లేక, పార్టీ అధికారంలో లేక ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు సొంత జిల్లాలోనూ తీవ్ర ఎదురుగాలి  ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్య నేత బంధువులతో ప్రత్యక్ష వివాదానికి దిగడం మరింత సంక్షోభానికి గురిచేసింది. కాగా, వీరి కుటుంబానికి దూరమైన ఒకప్పటి సన్నిహితుడి పేరు కూడా ఈ భూ వివాదంలోకి రావడం మరింత ఆసక్తిరేపింది. కొన్నాళ్లుగా విభేదిస్తున్న ఆయన పేరు ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియని పరిస్థితి.

విలువైన ఆస్తిపై ఎట్టకేలకు రాజీ?

కూకట్ పల్లి, మాదాపూర్, మియాపూర్.. హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఖరీదైన ప్రాంతాలివి. అలాంటి వాటికి సమీపంలో ఉంది మనం చెప్పుకొంటున్న వివాదాస్పద భూమి. ఎకరా, రెండు ఎకరాలు కాదు.. అది ఏకంగా 25 ఎకరాల స్థలం. అంటే విలువ ఏపాటి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న వైనాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఈ 25 ఎకరాల భూమి విలువ రూ.వెయ్యి కోట్లయినా అనుకోవచ్చు. కాగా, ఇటీవల ఆ భూమికి సంబంధించి తలెత్తిన వివాదంలో రాజీ కుదిరినట్లు తెలిసింది. 60-40 ఫార్ములా ప్రకారం ఇరు వర్గాలు రాజీ పడినట్లు సమాచారం. అంటే.. ఏపీ మాజీ ప్రజాప్రతినిధికి ఇందులో 40 శాతం వాటా ఉంటుంది.

మిగతాది తెలంగాణ ముఖ్య నేత బంధువులకు వెళ్లనున్నట్లు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ప్రజాప్రతినిధి భర్తకు బెయిల్ లభించిందని పేర్కొంటున్నారు. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. వివాదంపై రాజీ కుదరడంతో ఇటీవల బెయిల్ పొందినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News