'సీఎం కాన్వాయ్ కారు' ఇష్యూ పట్టుకొని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారే?

Update: 2022-04-22 09:49 GMT
నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని  పరిస్థితి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నెలకొంది. కొన్ని ఉదంతాలు.. వాటికి ప్రజలు స్పందిస్తున్న తీరు చూస్తే.. ఇలాంటి వాటికి ఇంత రియాక్షనా? అంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఒక వెయ్యి కోట్ల అవినీతి జరిగిందన్న మాట కంటే కూడా.. ఇద్దరు అధికారుల అత్యుత్సాహం జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించటమే కాదు.. సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యేలా చేస్తోంది.

సీఎం కాన్వాయ్ లో కారు కోసం తిరుపతి వెళుతున్న కుటుంబానికి చెందిన కారును బలవంతంగా లాక్కున్న అధికారుల వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటం.. ఈ ఇష్యూ చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించటం.. వారి పై వేటు వేయటం లాంటివి జరిగిపోయాయి.

అయినప్పటికీ.. దీని పై సోషల్ మీడియాలో మాత్రం రచ్చ ఆగట్లేదు.

ఎవరికి వారు తమకు తోచినట్లుగా కొత్త తరహా మీమ్స్ తో అదరగొట్టేస్తున్నారు. జగన్ సర్కారుపై తమకున్న వ్యతిరేకతను ప్రదర్శించటానికి వచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అయితే.. ఈ మీమ్స్ తో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం తప్పించి.. సీఎం స్పందించిన తీరును పరిగణలోకి తీసుకోకపోవటం గమనార్హం.

ఏపీ సీఎం  క్వాన్వాయ్ కోసం రోడ్డున వెళుతున్న వారి వాహనాల్ని బలవంతంగా లాక్కెళ్లే దరిద్రపుగొట్టు పరిస్థితి ఏపీలో ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఆ మాటకు వస్తే ఈ ఒక్క ఉదంతం ఏపీ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీయటమే కాదు.. జగన్ సర్కారుకు భారీ షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. ఈ వాదన నిజమన్నట్లుగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ ఖాతాలకు పలువురు పంపుతున్న మీమ్స్ కూడా సరికొత్తగా ట్రెండీగా ఉన్నాయని చెప్పాలి.

ఒక పాపులర్ మీమ్ లో.. రావు రమేశ్ కూర్చొని చెబుతున్నట్లుగా ఉన్న దానికి ఒక నెటిజన్ రాసిందేమంటే.. ‘‘ఆడెవడో గంజికి గతి లేకపోయినా బెంజి కారు కావాలన్నాడంట. కాన్వాయ్ లోకి కారు లేదు కానీ మూడు రాజధానులు కడతాడంట’’ అంటూ తనకున్న ఆగ్రహాన్ని కక్కేశారు. మరో మీవ్ లోకి వెళితే.. ఒక పెద్ద గుంట తీసి.. అందులో కి కారును క్రేన్ సాయంతో పెడుతున్నట్లుగా ఉన్న ఫోటోకు.. ‘సీఎం పర్యటన అని తెలియగానే కార్లను ఇలా దాచేస్తున్నారు’’ అన్న క్యాప్షన్ పెట్టి వైరల్ చేస్తున్నారు.

మరో వైరల్ మీమ్ లో బ్రహ్మానందం.. హేమ ఇద్దరి సంభాషణ అన్నట్లుగా భారీ పంచ్ వేశారు. బ్రహ్మానందంతో హేమ..‘‘ఏవండీ కారులో తిరుమల వెళదామండీ’’ అని అడిగితే.. దానికి బ్రహ్మనందం రియాక్టు అవుతున్నట్లుగా ఉన్న ఫోటోలో.. ‘సీఎం కాన్వాయ్ కి కార్లు లేవంట. బయట కార్ కనిపిస్తే దొబ్బుకెళ్తున్నారు. మూస్కుని ఇంట్లో కూర్చో’ అంటున్నట్లుగా మీమ్ తయారు చేశారు. ఇలా ఒక్క ఉదంతంతో విరుచుకుపడుతున్న తీరు.. జగన్ సర్కారుకు వేసవి ఉక్కపోతకు మించిన ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News